Jagan Flag Hoisting

 

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

 

విజయవాడ (ప్రశ్న న్యూస్) దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు. కరోనా ఆంక్షల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎందరో మహానీయుల త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఏపీ ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. తన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, ఇప్పుడు వారి కష్టాలను తొలగించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం చెప్పారు. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు.

రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని” సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని విద్యాలయాలు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మార్చామని ఆయన తెలిపారు. అక్కాచెల్లెమ్మల విద్య కోసం తమ ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. పేదలకు ఉచితంగానే మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్య, వైద్యం అనేవి తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలని అన్నారు. వృద్ధులు, వికలాంగులైన ప్రతి ఒక్కరికీ పింఛను ఇస్తున్నామని తెలిపారు. నెలకు 2250 రూపాయలను ఇస్తున్నామన్నారు. గతంలో 500-1000 రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛను అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్‌బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1039 కోట్లు చెల్లించాం. ఏపీ అమూల్‌ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచాం’ సీఎం జగన్ తెలిపారు. ఆమూల్ తోపాటు అనేక సంస్థలను ఏపీకి తీసుకొచ్చామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చామని సీఎం జగన్ తెలిపారు. నేటి కంటే రేపు బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రతీ రూపాయిని బాధ్యతగా ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. యువతకు విద్యా, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్ పోస్టుల్లో ప్రాధాన్య కల్పించామని, మహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందించాం. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్‌స్టేషన్లు, దిశా యాప్‌లు తీసుకొచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణం జరుగుతోందని సీఎం జగన్‌ వివరించారు. 26 నెలల కాలంలో ఎన్నో పథకాలను ప్రారంభించామని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లు తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మారుస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడినా సంక్షేమ పథకాల అమలులో వెనుకాడలేదని సీఎం జగన్ చెప్పారు. పోలీసులకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీకాఫ్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఆ దేవుడి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తన ప్రసంగం అనంతరం సీఎం జగన్ పోలీసు అధికారులకు పతకాలను అందజేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.