Prak

జాతీయ రాజకీయాల్లో మోదీకి వ్యతిరేక కూటమి

 

🔹ప్రశాంత్ కిషోర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా

రాజకీయ వ్యూహకర్త పదవికి దూరంగా ఉంటానన్న ప్రశాంత్ కిషోర్ తరువాత టార్గెట్ ఏంటి..? బీజేపీని టార్గెట్ చేస్తున్నారా..? ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని భావిస్తున్నారా..? ఇంతకీ పీకే న్యూ స్ట్రాటజీ ఏంటి..?

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశ రాజ‌కీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహాలు ప‌న్న‌డంలో ఆయనది ప్రత్యేక శైలి.. ఇప్పటికే అసాధ్యం అనుకున్న చోట్ల కూడా విజయాలు సాధించి ప్లానింగ్ లో తనను మించిన వారు లేరని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఇప్పటి వరకు పలు పార్టీల రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత.. రాజకీయ వ్యూహకర్త పదవికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆయన వేరే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దేశ‌ వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేక కూట‌మిని కూడ‌గ‌ట్టే ప‌నిలో ఆయన బిజీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. కేద్రంలో తిరుగులేని నేత‌గా ఉన్న ప్రధాని మోదీ ఇమేజ్‌ను త‌గ్గించ‌డానికి, బీజేపీని ఓడించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న‌ ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌య‌త్నిస్తున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్ సెకెండ్ వేవ్  కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చింది. ప్ర‌జ‌ల్లో కూడా బీజేపీపై ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో మిష‌న్ 2024లో భాగంగా ఇప్ప‌టికే ఆయ‌న ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను క‌లిసి దేశ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా కలుస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం మోదీకి వ్య‌తిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీల‌ను ఒకటి చేయ‌డానికి పీకే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కేటీఆర్‌తో ప‌లుమార్లు సంప్ర‌దింపులు కూడా జ‌రిపినట్టు టీఆర్ఎస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కూడా బీజేపీకి వ్య‌తిరేకంగానే ఉన్నారు. తాజాగా ఈటెల ఎపిసోడ్ తో తెలంగాణ లో trs-bjp మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఢీ అంటే ఢీ అనే పరిస్థితే ఉంది. సీఎం కేసీఆర్ జాగ్రత్త పడకపోతే బీజేపీ బలపడే ప్రమాదం ఉంది. అందుకే కేంద్రానికి వ్యతిరేక కూటమికి కేసీఆర్ నాయకత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పీకేతో భేటీ తరువాత దీనిపై క్లారిటీ వచ్చే అవాశం ఉంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే కీలక రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్స్‌గా భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం కానున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ ఓటమి పాలైతే 2022 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటికి ప్రతిపక్షాలు పూర్తిగా బలపడతాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ సీఎంలు బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. వీరంతా ఒక్కటైతే.. వారికి మరింత మంది తోడయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే మొత్తం దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి.తెలుగు రాష్టాల పరిస్థితి చూస్తే సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.. కానీ సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం ఉంది. అది జరిగితే జగన్ కు పీకే దూరమవుతారు. కానీ జగన్ తో సన్నిహిత సంబంధం ఉన్న పీకే మాత్రం వైసీపీని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు.. 2024 ఎన్నికలకు ముందే బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరాలని జగన్ ను కోరే అవకాశం ఉంది. ఆ నిర్ణయంతో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకోక తప్పదని.. కానీ భవిష్యత్తులో అది మేలు చేస్తుందని  సీఎం జగన్ ను ప్రశాంత్ కిషోర్ ఒప్పిస్తారనే ప్రచారం కూడా ఉంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.. 2022 ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.2022తో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ పదవీ కాలం ముగుస్తోంది. అప్పటికి బీజేపీ బలం ఎంత అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం బీజేపీ బలం తగ్గిన రాష్ట్రపతి పదవితోనే బీజేపీకి చెక్ పెట్టే యోచనలో పీకే ఉన్నారనే ప్రచారం పోలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.