జీవోలు ఆన్ లైన్ లో ఉంటే తప్పేంటి .?
తెలంగాణ హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఉమ్మడి ఏపీలో అప్పుడప్పుడూ కనిపించే రహస్య జీవోల వ్యవహారం రాష్ట్ర విభజన తర్వాత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ తాజాగా దళితబంధు పథకానికి సంబంధించి జారీ చేసిన జీవోను ఆన్ లైన్ లో పెట్టకపోవడంపై ఇవాళ హైకోర్టు సీరియస్ అయింది. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో దళితబంధు పథకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ పథకం అమలుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ ఫర్ పీపుల్స్ వాయిస్ సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీజే హిమాకొహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం.. తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోల్ని వెబ్ సైట్ లో పెట్టడానికి ఇబ్బందేంటని కేసీఆర్ సర్కార్ ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జీవో జారీ చేసిన 24 గంటల్లో అది వెబ్ సైట్ లో ఉండేలా చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దళితబంధు పథకం నిబంధనలు ఖరారు చేయకుండానే వాసాలమర్రిలో ప్రజలకు ఈ పథకం కింద నిధులు విడుదల చేశారని దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఏజీని ప్రశ్నించింది. దీంతో ఆయన రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అన్నింటికీ ఈ పథకం వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై జారీ అయిన జీవోను ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే జీవోను వెబ్ సైట్ లో పెట్టాలని సూచించింది. మరోవైపు ఏపీలో తాజాగా వైసీపీ సర్కార్ కూటా ఆన్ లైన్ లో జీవోలు పెట్టరాదని అధికారికంగానే నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై ఏ ప్రభుత్వ శాఖ కూడా జీవోలు వెబ్ సైట్ లో పెట్టకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఇదే అంశంపై ఏపీ హైకోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే ఇక్కడ కూడా అవే ఆదేశాలు వెలువడే పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వం అంతర్మథనంలో ఉంది.