33Main2

జూన్ 3వరకు సూపర్ స్పైడర్లందరికి వ్యాక్సీన్ – హరీష్ రావు

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు టి.హరీష్ రావు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్‌.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్‌.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు 10,000 మందికి టీకాలు వేయాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్ కోటా, అందిన వ్యాక్సిన్, అందుబాటులో వున్న వ్యాక్సిన్ నిల్వల గురించి మంత్రి హరీష్ రావు సమీక్షించారు. రాష్ట్రానికి ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులను కేటాయించుటకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

వైద్య పరికరాలను సేకరించడం, ఆక్సిజన్ సరఫరా, స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లు మరియు 3 వ వేవ్ కోవిడ్ -19 ప్రభావం నివారణ చర్యలపై అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షించారు. అంతే కాకుండా క‌రోనా సెకండ్ వేవ్ విజ్రుంబిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగిస్తున్న విష‌యం అందిరికి తెలిసిందే. క‌రోనా రెండవ దశ, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఉపాది కోల్పోయి అర్థాక‌లితో అల‌మ‌టిస్తున్నపేద‌ల క‌డుపు నింపేందుకు చంద్రశేఖర్ రావు ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యాలు తీసుకుంటోదని మంత్రి అభిప్రాయపడ్డారు. పేదల ఆకలిని తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అదికారులకు సూచించారు. ఈ సమీక్షలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం. రావు, వైద్య విద్య డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓ.ఎస్.డి. గంగాధర్ మరియు కాళోజి నారాయణ రావు హెల్త్ యునివర్సిటి వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.