జోష్ లో సీతక్క…
🔹టీపీసీసీ చీఫ్ ను కలిసేందుకు 100 భారీ కార్ల భారీ కాన్వాయ్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క సంబరాల్లో మునిగిపోయారు. తన సోదరుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచిత స్థానమిచ్చి గౌరవించిందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుందని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం సులభమవుతుందని పేర్కొన్న సీతక్క ఈరోజు రేవంత్ రెడ్డిని కలవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వంద కార్ల భారీ కాన్వాయ్ తో వరంగల్ జిల్లా నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో భారీ కాన్వాయ్ తో బయలుదేరి తెలంగాణ రాష్ట్రంలో ముందు ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వంలో దూకుడు చూపించబోతోంది అన్న సంకేతాలు ఇచ్చారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం రావాలని పదేపదే కోరుకున్న సీతక్క ఆయనకు అవకాశం ఇచ్చినందుకు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక సమ్మక్క సారలమ్మలకు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావాలని మొక్కుకున్నానని, రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చినందుకు నిన్న మొక్కలు కూడా చెల్లించుకున్నారు సీతక్క.
ఊరేగింపుగా డప్పుల చప్పుళ్ళతో మేడారం వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఈ రోజు ములుగు నియోజకవర్గం లో భారీ ర్యాలీ నిర్వహించి, భారీ కాన్వాయ్ తో రేవంత్ ను కలవడానికి పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. మార్గమధ్యలో గట్టమ్మ కు మొక్కులు చెల్లించుకున్న సీతక్క వన దేవతల ఆశీర్వాదంతో, బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోదరుడు రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేయడానికి ములుగు పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరారు. వాహనం ఎక్కి నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ నాయకత్వంలో కీలకంగా పనిచేస్తాయని సీతక్క వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ నియామకంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ, సీతక్క మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ములుగు నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారు. ఇది అందరం ఒక్క తాటి పైకి రావలసిన సమయం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.