టార్గెట్ జీవో నంబర్ 41
అమరావతిలో జగన్ మరో ఆపరేషన్
అసైన్డ్ భూములు కొన్నవారికి సీఐడీ నోటీసులు
సమాధానమిచ్చేందుకు 15 రోజుల గడువు
అమరావతి (ప్రశ్న న్యూస్) అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని నిరూపించడంలో విఫలమైన వైసీపీ సర్కార్.. ఇప్పుడు మరో ఆపరేషన్ కు తెరదీస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు పసలేనివని తేలిపోవడంతో ఇప్పుడు అసైస్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాల్ని నిరూపించడం ద్వారా అమరావతిలో భూముల స్కాం జరిగిందని తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు కలకలం రేపుతున్నాయి. అయితే అసైన్డ్ భూముల క్రయ విక్రయాలపై ఇప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడం విశేషం. అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా చోటు చేసుకున్న భూముల అక్రమాలపై వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచే ఆరోపణలు చేసేది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దర్యాప్తు సంస్ధల్ని రంగంలోకి దించి ఇన్ సైడర్ ను నిరూపించేందుకు అష్టకష్టాలు పడింది. అయినా అమరావతిలో ఇన్ సైడర్ ఆరోపణల్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టేయడంతో వైసీపీ సర్కార్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. అటు అసైన్డ్ భూముల వ్యవహారంలోనూ విపక్ష నేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసుల్లోనూ ముందడుగు వేయలేని పరిస్ధితులున్నాయి. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న తమ ఆరోపణల్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చడంతో ఇక అసైన్డ్ భూముల క్రయ విక్రయాలపైనే దృష్టిసారించాలనే అంచనాకు వైసీపీ సర్కార్ వచ్చేసింది. దీంతో అసైన్డ్ భూముల వ్యవహారంలో లొసుగుల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం మరో ఆపరేషన్ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములు అమ్మిన, కొన్న వారిని టార్గెట్ చేస్తోంది. వీరి నుంచి కీలక ఆధారాలు సంపాదించగలిగితే అమరావతిలో స్కాం జరిగిందనే తమ ఆరోపణలకు బలం చేకూరుతుందని వైసీపీ సర్కార్ ఆశిస్తోంది. దీంతో మరోసారి సీఐడీని రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణను కూడా టార్గెట్ చేసినా స్కాం వ్యవహారంపై దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం కాబట్టి గతంలో అలా జరిగిన క్రయ విక్రయాలను బయటపెట్టేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. అమరావతిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేస్తోంది. రైతుల్ని రాజధాని రాకముందే మభ్యపెట్టి అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఇప్పుడు ఇదే వ్యవహారాన్ని నిరూపించేందుకు సీఐడీ ప్రయత్నాలు చేస్తోంది. అసైన్డ్ భూములు కొన్న వారంతా టీడీపీ నేతలేనని ఆరోపిస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు సీఐడీ సాయంతో ఆ వ్యవహారాన్ని బయటపెట్టబోతోంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం వాటిని విక్రయించుకునేందుకు జీవో నంబర్ 41 జారీ చేసింది. ఈ జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణను ఇప్పటికే టార్గెట్ చేసి కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఇప్పుడు ఆ జీవో ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారిని కూడా టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో అసైన్డ్ భూముల్ని దళిత రైతులు అమ్ముకోవడం వెనుక ఎవరి ప్రమేయముందో కూడా తేల్చే పనిలో సీఐడీ బిజీగా ఉంది. దీంతో జీవో నంబర్ 41 మరోసారి తెరపైకి వస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో నంబర్ 41 ను రద్దు చేస్తూ దాని స్ధానంలో జీవో నంబర్ 316 విడుదల చేసింది. దీని ప్రకారం అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధమని పేర్కొంది. దీంతో తాజా జీవో ఆధారంగా గతంలో జరిగిన క్రయ విక్రయాలపై చర్యలకు సీఐడీ సిద్ధమవుతోంది. అమరావతిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు తీసుకుని ఆ తర్వాత వాటిని ప్రభుత్వానికి విక్రయించి ప్లాట్లు తీసుకున్న వారిని టార్గెట్ చేయాలని సీఐడీ భావిస్తోంది. అందుకే ఇలా అసైన్డ్ భూములు కొనుగోలు చేసి రాజధానికి ఇచ్చి ప్లాట్లు తీసుకున్న వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత రెండు రోజుల్లోనే దాదాపు 50 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి కూడా వారం రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. నోటీసులు జారీ చేసిన వారందరికీ 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని సీఐడీ కోరుతోంది. అయితే గతంలో అమల్లో ఉన్న జీవో ఆధారంగానే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు చెప్తున్నారు.
అమరావతిలో భూముల క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీతో పాటు ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నా ఇప్పటికీ అక్కడ భూముల వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం విశేషం. అసైన్డ్ తో పాటు ఇతర భూముల క్రయ విక్రయాలపైనా ప్రభుత్వానికి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అయినా ప్రభుత్వం దర్యాప్తు పేరుతో తమను వేధిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేయకుండా, బాధితుల్లేకుండా స్కాం పేరుతో దర్యాప్తు సంస్ధలు తమకు తరచూ నోటీసులు ఇవ్వడం, సీఐడీ కార్యాలయాలకు పిలిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.