టీఆర్ఎస్ నేతలకు అల్జీమర్స్ వ్యాధి – దాసోజు శ్రవణ్
🔹ఎవరి జాగీరని ప్రభుత్వ భూములు అమ్ముతారు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటని ప్రశ్నించారు. ఆర్టికల్ 20 ప్రకారం ప్రభుత్వం ట్రస్టీగానే వ్యవహరించాలన్నారు. తనను తిట్టినా, చంపినా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆదాయ సమీకరణ కోసం.. భూములు అమ్మవద్దని 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ జీవో 61 విడుదల చేసిందని… ఆ జీవోను అమలు చేస్తామని 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంగీకరించిందని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకోవడమేంటని మండిపడ్డారు.
ఎవరి జాగీరని భూములను అమ్ముతున్నారని ప్రభుత్వాన్ని శ్రవణ్ ప్రశ్నించారు. రూ.15వేల కోట్లు,రూ.20 వేల కోట్ల కోసం కాదని… దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందని అన్నారు. కచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదని విమర్శించారు. వైఎస్ హయాంలో భూ కేటాయింపులు జగన్ పేరుతో, జగన్ బినామీల పేరుతో ఉన్నాయన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్, కేసీఆర్ ఇద్దరు దోస్తులని… అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములపై ఆలోచన చేయడం లేదని అన్నారు. నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్రంలో నిరుపయోగంగా ఉండి, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల భూములతో పాటు జిల్లాల్లోనూ భూముల విక్రయాలకు సిద్దమవుతోంది. జిల్లాల భూముల గుర్తింపు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. వేలం ప్రక్రియ ద్వారా భూములను విక్రయించనున్నారు.