KCR

 

టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిపై కసరత్తు..

 

🔹కేసీఆర్ మదిలో కొత్త పేరు ?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగినున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆపరేషన్ హుజూరాబాద్ కోసం టీఆర్ఎస్‌లోని మంత్రులు, సీనియర్ నేతలు అంతా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్‌లో ఎవరు బరిలో ఉంటారనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. హుజూరాబాద్‌లో ఈటలను ఢీ కొట్టే నాయకుడు ఎవరనే దానిపై లెక్కలు వేసుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇందుకోసం పలు సర్వేలు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన ఎల్.రమణ, కౌశిక్ రెడ్డితో పాటు త్వరలోనే పార్టీలోకి రానున్న పెద్దిరెడ్డిని బరిలోకి దింపే అంశంపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోందని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ తరపున కొత్త పేరు తెరపైకి వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత స్వరం రవిను పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చే అంశాన్ని టీఆర్ఎస్ పరిశీలిస్తోందని సమాచారం. ఆయన పారిశ్రామికవేత్త కావడం, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు కలిసొచ్చే అంశమని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారని.. ఈ అంశంపై చర్చించారని సమాచారం. అయితే ఈ విషయంలో అన్ని అంశాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్.. ఎన్నికలకు ఇంత ముందుగానే అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని అనుకోలేమని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో టీఆర్ఎస్ ఇంకా తుది కసరత్తు పూర్తి చేయనట్టే కనిపిస్తోంది.