టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వం అందుకున్న ఎల్.రమణ
టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయనకు ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. జూలై 16న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నారు.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయనకు ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. జూలై 16న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నారు. జూలై 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ఎల్.రమణను ఆహ్వానించారు. తమ పార్టీలో తగిన గౌరవం దక్కేలా సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ భేటీలో హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఎల్.రమణ, కేసీఆర్ చర్చించారు. కేసీఆర్‌ను కలిసిన మరుసటి రోజే టీ.టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్.రమణకు మంచి పట్టుకుంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎల్. రమణ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. అంతేకాదు అవసరమైతే హుజురాబాద్ ఎన్నికల్లో బరిలోకి రమణను దింపాలని చూస్తున్నారట. ఈటెల బీసీ నాయకుడు కావడంతో మరో బీసీ నాయకుడిని బరిలోకి దింపితేనే బాగుంటుందని యోచిస్తున్నారట. ఆయనను హుజూరాబాద్ నుంచి బరిలో దింపడం లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు తెలంగాణలో బీసీ నాయకునిగా ఎల్. రమణకు గుర్తింపు ఉంది. ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని పేరుంది. తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కేడర్ కూడా చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో.. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని రమణ నిర్ణయించుకున్నారు. జూలై 16న కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.