revanth

 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాళ్ళ స్వాగతం..

 

🔹పార్టీ నేతల్ని ఏకతాటి మీదకు తీసుకురావటం కత్తిమీద సామే
🔹మొదలైన అసంతృప్తి సెగ .. రేవంత్ కు మొదలైన కష్టాలు
🔹కఠిన నిర్ణయాలు తీసుకోగలడా ? రేవంత్ కు సహకరించేది ఎంత మంది
🔹కాంగ్రెస్ లో అడుగడుగునా వర్గ విబేధాలు , ఆధిపత్య పోరాటాలు
🔹తెలంగాణా కాంగ్రెస్ లో లుకలుకల పర్వం
🔹రేవంత్ కి రిస్కీ టాస్క్!!

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీనే నమ్ముకుని మొదటి నుంచి పనిచేసిన సీనియర్లు ఎంతో మంది ఉండగా రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించడం సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు, వర్గ విబేధాలు రేవంత్ నియామకంతో మరోమారు తెర మీదకు వస్తున్నాయి. కొందరు రాజీనామాల బాట పడుతుంటే, మరికొందరు ఓటుకు నోటు వ్యవహారంతో లింకు పెట్టి, కాంగ్రెస్ కూడా టిడిపి మాదిరిగానే కొట్టుకుపోతుంది అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ గా అందరినీ ఏకతాటి మీద నడిపించాల్సిన రేవంత్ రెడ్డి బాధ్యత కత్తి మీద సామే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కన్నా బిజెపి బలపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీని సైతం బలోపేతం చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది.

తెలంగాణ సర్కారు మీద, సీఎం కేసీఆర్ మీద దూకుడుగా ముందుకు వెళ్ళగలిగే నాయకుడు, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని నిలబడే నాయకుడు రేవంత్ రెడ్డి అని భావించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ ను సెట్ చేసే బాధ్యతను అప్పగించింది. ఇదే సమయంలో టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో సరిదిద్దాల్సిన ఎన్నో అంశాలు ఉండగా, ఇక అసంతృప్తులను బుజ్జగించడం ప్రస్తుతానికి ప్రధానమైన టాస్క్ గా మారింది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవితో అనేక సవాళ్లను నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది.ఇప్పటికే వరుస ఓటములతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కంటే దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు రావాల్సిన బృహత్తర బాధ్యత రేవంత్ రెడ్డి పై ఉంది. ఇక త్వరలో రాబోతున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి నాయకత్వానికి పెను సవాల్ విసరనుంది .ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య, పార్టీ నాయకుల మధ్య అంతర్గత కలహాలు రేవంత్ కు పెద్ద సవాల్ విసురుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పరిస్థితి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

రేవంత్ రెడ్డి తోపాటు నియామకమైన కొత్త కార్యవర్గం పార్టీని ప్రక్షాళన చేయడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీని వదిలి వెళ్లి పోయే అవకాశం కనిపిస్తుంది. అది భవిష్యత్తులో నాలుగడుగులు ముందుకి వేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీని, పదడుగులు వెనక్కు లాగే పరిస్థితి కూడా ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తోనూ, గత దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బిజెపితోనూ పోరాటం సాగించాల్సి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతమంది రేవంత్ రెడ్డికి సహకరిస్తారు అనేది అనుమానమే. అందరినీ కలుపుకొని పని చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా? అంటే కష్టమే అని చెప్తున్నారు రాజకీయవిశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి స్వాతంత్రం ఎక్కువ ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు పార్టీ నిర్ణయాలకు అంటే తమ సొంత నిర్ణయాలనే ఎక్కువగా మాట్లాడుతుంటారు .ఇదే సమయంలో ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, ఆధిపత్యపోరు షరా మామూలే . రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు.
మరి కొందరు సీనియర్ నాయకులు ఈ పార్టీలో తాము ఉండలేమంటూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం రేవంత్ రెడ్డి దూకుడు పార్టీకి ప్లస్ అవుతుంది అన్న భావన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో అనేక సవాళ్లు, అసంతృప్తుల మధ్య రేవంత్ రెడ్డి పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్తాడు అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో కదిలిన లుకలుకల తేనెతుట్టె కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ పొజిషన్ లో నిలబెడుతుందో వేచి చూడాలి.