తుల (Libra) 2022-2023
శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు
Libra/Tula/తులారాశి
(చిత్త: 3,4 పాదములు, స్వాతి: 1,2,3,4 పాదములు, విశాఖ: 1,2,3 పాదములు)
(ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 07 అవమానం – 05)
ఈ రాశివారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి షష్ఠస్థానమందు లోహమూర్తి ధనహానిని కలుగజేయును. కలిగిన ధననష్టాన్ని ఆపలేకపోయినా, గత కొద్దికాలంగా మానసికవ్యధతో బాధపడుతున్న ఈ రాశివారికి గురుని సంచారం వలన అవి తొలగి మానసిక ప్రశాంతత, ఆత్మస్థెర్యం కలిగేటట్టు చేస్తుంది. శనైశ్చరుడు ఏప్రిల్ 29 నుండి పంచమ స్థానమందు కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచరించును. రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా సప్తమ, జన్మస్థానములందు సువర్ణమూర్తులుగా సంచరింతురు.
గురు,శని,రాహుకేతువుల సంచారము వీరికి అంతగా అనుకూలము కాదు, కానీ సంవత్సర ప్రారంభములో అనుకూల పరిస్థితులుంటాయి. అపరిమితమైన ఆనందము, సంతోషము తన బంధువుల వలన సౌఖ్యము, కార్యదీక్ష ఐశ్వర్యవృద్ధి, సంపదలను సృష్టించుట మొదలగు ఉత్తమమైన ఫలితములుండును. మే జూన్ నెలలు చాలా అనుకూలము, తదుపరి సామాన్యము. విద్యార్థులకు విద్యా విషయములపై అనాసక్తి, దుష్ట సంభాషణలు, తదుపరి చెడుపనులు, దుర్జన సాంగత్యము వలన అవాంతరములు, చెడు వ్యసనములకు లోనగుట మొదలగు విషయములపై ముందుగానే శ్రద్ధ వహించుట మంచిది.
ఈ రాశివారికి దుష్టజన సావాసము వలన పేరు ప్రతిష్ఠలు తగ్గుట, వివాహములు వాయిదా పడుట జరుగును. షష్ఠరాశి యందు బృహస్పతి సంచారము వలన భార్యా వర్గముతోగాని, సోదరవర్గము వారితో గాని విరోధము కల్గు సూచనలు కలవు. ధనాదాయం విషయంలో లోటు ఉండదు గాని, గృహ వాతావరణం సరిగాలేక అస్తిమిత పరిస్థితులుంటాయి. వ్యవసాయదారులకు పంటలు స్వల్ప లాభాలనిస్తాయి. జన్మరాశిలో కేతువు ఛాయాగ్రహం, మోక్షకారక గ్రహం ఇది జాతకుని ఆత్మపై ప్రభావాన్ని చూపి ఆధ్యాత్మిక ధోరణిని కల్గించి కలిప్రభావానికి దూరంగా ఉందేటట్లు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా విద్యార్ధులను పగటికలలు కనేటట్టు చేసి జాతకునికి భ్రమను కలిగించి, అలసత్వం వలన విద్యపై అనాసక్తిని కలుగచేస్తుంది. విద్యార్థులు శ్రమచేసి విద్యా విషయములలో ఉన్నతి సాధించి పురోగమనములో నడిచెదరు.
Know More Libra/Tula/తులారాశి
నవంబరు నుండి సంవత్సరాంతము వరకు సుమారు ఐదు మాసములు అష్టమ స్థానమందు కుజ వక్రస్తంభన వలన వ్యాధులు, అనారోగ్యము, జూదములకు బానిసై ధనము పాడుచేయుట, అపమృత్యు దోషము, శత్రుత్వము మొదలగు దోషపరిహారార్ధము మాసశివరాత్రినాడు లేక తరచూ ఈశ్వరాభిషేకములు చేయుట మంచిది. మన్యుసూక్త సహితముగా సుబ్రహ్మణ్య అభిషేకము, అంగారక స్తోత్రము పారాయణచేయుట, కుజగ్రహజపము, ఎర్రటివస్త్రములో కందులు దానము చేయుట ఇవన్నీ తగిన పరిహారములు. తులారాశిలోని కేతువు సంక్రమణము వలన ఈ రాశివారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, వ్యక్తులు మరియు జనంతో వ్యవహరించడంలో, వారిని ఉన్నతులుగా చేసి సంస్థలను సమర్ధవంతంగా నడపగల్గునట్లు చేస్తుంది. అహంకారం మరియు దురుసు స్వభావానికి, కోపోద్రేకానికి లోనై మనస్తాపం చెందేటట్టు చేస్తుంది.
చిత్రా నక్షత్రం వారు పగడం ధరించుట, సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. స్వాతి నక్షత్రము వారికి కుటుంబ వృద్ధి, గోమేధికము ధరించుట, విశాఖ వారికి శ్రమతో కార్యసాధన సత్ఫలితములు, పుష్యరాగము ధరించుట మంచిది.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య – ‘6’. 5, 7, 9 తేదీల సంఖ్యలు, బుధ, శుక్ర, శనివారములు కలసిన యోగము.
నెలవారీ ఫలితములు
ఏప్రిల్: శత్రుక్షయము, మిత్రలాభము స్వశక్తిపై కార్యసాధన ప్రయత్నించిన పనులు అనుకూలమగును. ధనధాన్య వివర్ధనము, పుత్ర పౌత్ర ప్రవర్ధనమై కుటుంబ వృద్ధిని పొంది సంతోషముగా గడిపెదరు.
మే: వేళదాటి భుజించుట, దేహమున అజీర్ణము ఉదర సంబంధ స్వల్ప అనారోగ్యములు, వృత్తి వ్యాపారములు మందగించుట, దూరప్రాంతములకు తిరుగుటవలన అలసట నొందుట, భాగస్వామ్య వ్యాపారములతో విముఖత కల్గును.
జూన్: స్వల్పభోజనము, అలసత్వము, గంభీరము చెడుట, హృదయ పరితాపము, ఉద్యోగములో జగడము, అధికారుల వత్తిడి వస్తువులను పోగొట్టుకొనుట, పోయిన వస్తువులు తిరిగి లభించుట, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయుట మంచిది.
జూలై: దుఃఖము నశించి ఆనందోత్సాహాలు వెల్లివిరియుట, సమాజములో గొప్పవారితో పరిచయములు మీ సహాయమును వారు అర్ధించుట, బంధువులతోనూ స్నేహితులతోనూ చేరిక రాజసందర్శనము ద్రవ్యలాభము కల్గును.
ఆగష్టు: రాజకీయముగా పలుకుబడి సాధించి ప్రజాదరణ పొందుతారు. ఉద్యోగస్తులకు అధికార పరిధి విస్తరణ మరియు వృద్ధి యగును. సంస్థలను సక్రమముగా నడిపి మీ బాధ్యతలను నెరవేరుస్తారు. మాసాంతములో ధనలాభము కల్గును.
సెప్టెంబర్: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సమస్త ఐశ్వర్యములు వృద్ధి చెందుతాయి. సంతానం విషయంలో ముందంజ వృత్తి వ్యాపారాలు అనుకూలం. ప్రతీ విషయంలోనూ ఇతరులను శంకిస్తారు. పన్నుల రూపంలో భారీమూల్యం చెల్లిస్తారు.
అక్టోబర్: తెలివితేటలున్నా సమయస్ఫూర్తి లేకపోవడం వలన ఇతరులతో జగడాలకు దిగే అవకాశం ఉంది. ఇతరులతో సంయమనము పాటించుట అవసరము. గ్రహస్థితి సామాన్యము. గౌరవానికి, ధనానికి లోటులేదు. తొందరపాటు నిర్ణయాలు మానండి.
నవంబర్: అష్టమరాశిలో కుజుడు వక్రించి స్తంభించి యుండుట వలన అపమృత్యు దోషమునకు రుద్రాభిషేకము చేయించుకొనుట మంచిది. జూదములాంటి వ్యసనములకు లోనైనవారికి ఇబ్బందులు తప్పవు. ధనలోటు.
డిసెంబర్: శత్రువుల విషయంలో బహు జాగ్రత్త అవసరము వ్యసనములకు లోనగుట, డబ్బుతో పందెములు కాచుట ధననష్టము ఇటువంటి అనైతికమైన పనులవలన కుటుంబ ప్రతిష్ట దిగజారి కుటుంబము ఇబ్బందులు పడుట. ఈ రాశిలో అందరికీ గాకపోయిననూ స్థూలముగా పై ఫలితములు సూచించును.
జనవరి 2023: ధనము చోరికి గురియగుట, ధనవ్యయముపై నియంత్రణ లేక ఇబ్బందులు, గతమాసము కంటే సంతృప్తికరముగా యుండుట, ధైర్యముతో ప్రణాళికతో ముందంజ, చేతికి ధనము వచ్చును. ఆదాయ మార్గము లేర్పడును.
ఫిబ్రవరి: కోర్టు వ్యవహారాలలో ప్రతిష్టంభన యేర్పడును. ఎక్కడి వ్యవహారములక్కడ నిలచి యుండును. గృహ నిర్మాణములు కలసిరావు. ఇరుగుపొరుగువారి మేలుకోరి స్నేహ హస్తములు అందించుట మంచిది.
మార్చి: ఇష్టార్ధ లాభములు భార్యాపుత్రులతో వివాదములు వదలి బుద్ధిగా యుండుట, సుఖము మృష్టాన్న భోజనము, ఆదాయమార్గములు పెరుగుట, వ్యవహార ప్రతిబంధకములు మాత్రము కొనసాగును. శ్రీసుబ్రహ్మణ్యుని ఆరాధన చేయుట మంచిది.
** ** **