PrajaPrashna

Telugu Daily Newspaper

తుల (Libra)

Libra(Tula)

తుల (Libra)

 

చిత్త 3,4 పా||లు,స్వాతి 4 పా||లు, విశాఖ 1,2,3 పా॥లు :-ఆదాయ 11 ఖర్చు – 5; రాజపూజ్యత – 2 అవమానం

 

గురుడు: ఈ సంవత్సరమంతయు పంచమమందు సంచరించును. శని: ఈ సంవత్సరమంతయు చతుర్థమందు సంచరించును. రాహువు: సంవత్సారాది నుండి అష్టమ మందు, కేతువు ద్వితీయ మందు సంచరించును.

ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభములు మిశ్రమముగా ఉన్నవి. గురుబలం మాత్రమే ఉన్నది. స్వశక్తి చేత స్వబుద్ధిచేత ప్రారంభించిన కార్యములను సమర్థవంతంగా పూర్తి చేస్తారు, దైవారాధన మంత్ర ఉపాసన వలన దైవానుగ్రహం కలుగుతుంది, దూర దేశ ప్రయాణాలు లాభిస్తాయి, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉండును, ఋణములు చేసి నూతన వాహనాలు కొనుగోలు చేయుదురు, వాహన ప్రమాదములు, చిత్తచాంచల్యం, ప్రశాంతత లేకపోవుట, భయము, వాతముచేత శరీర పీడ, అనారోగ్యము, తల్లి గారికి అనారోగ్యం, భాగస్వామితో విరోధములు, బంధు విరోధములు, మిత్రుల సహాయ సహకారములు వలన మేలు జరుగును. స్థానచలనం, ఉన్నత పదవి, ధనము లేదా ఆభరణములు పోగొట్టుకొనుట, మోసమునకు గురి అగుట, యజ్ఞయాగాది క్రతువులు, పూజలలో పాల్గొనుట. సాధువుల దర్శనము, నీటి వలన ప్రమాదము, చతుష్పాద జంతువుల వలన ప్రమాదము, ఉద్యోగమునందు ఆటంకములు కలుగును. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటలు మిశ్రమ ఫలితములు ఇచ్చును. రాజకీయ నాయకులు ప్రజల వ్యతిరేకతను చవిచూసెదరు. ధాన్యం వ్యాపారులకు లాభదాయకంగా ఉండును, మత్స్య, పౌల్డీ వ్యాపారులు ఇబ్బందులకు గురి అగుదురు. చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులు కష్టించి పనిచేయు వారికి మధ్యమ ఫలితము లభించును. వైద్యులకు గౌరవ భంగము కలుగును.

ఈ రాశివారు చండీ పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణలు, శివాభిషేకము చేయించుట, శివస్తోత్ర పారాయణం, శనివార నియమం ఆచరించుట మంచిది.

చైత్రమాసం (13th April to 11th May) : ఈ మాసం మిశ్రమ ఫలితములు కలుగును, అధికారుల వలన లాభము, ఉద్యోగ ప్రయత్నం ఫలించుట, శత్రుబాధలు నుండి విముక్తి, ధననష్టము, ఋణములు చేయుట జరుగును.

వైశాఖ మాసం (12th May to 10th June) : ఈ మాసం మిశ్రమ ఫలితములు కలుగును. విద్య మూలకము గా వినోదము, తన్మూలకంగా సౌఖ్యము కలుగును. అనారోగ్యము, వైద్య సేవ, శత్రువృద్ధి ఉన్నప్పటికీ శాంతముగా గడి పేదరు.

జ్యేష్ఠ మాసము (11th June to 10th July) : శుభ కార్యక్రమములలో పాల్గొనుట, పుత్రుల వలన ఆనందము, సుఖము కలుగుట. పితృదేవతల అనుగ్రహం, ఋణములు చేసి చిరాస్తి కొనుగోలు చేయుట, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయుట జరుగును.

ఆషాడ మాసం (11th July to 8th August) : ఈ మాసం అన్ని విధములుగా బాగున్నది. ప్రారంభించిన ప్రతి కార్యము లాభము కలిగించును. ఉద్యోగ, వ్యాపారము నందు, వ్యవసాయము నందు లాభదాయకంగా ఉండును. అందరి మన్ననలను పొందుదురు.

శ్రావణ మాసము (9th August to 7th September) : ఈ మాసం అన్ని విధములుగా శుభ ఫలితములు ఇచ్చును. ఉద్యోగ అభివృద్ధి, అధికారుల వలన ప్రశంసలు పొందుట, సోదరులు వల్ల లాభం, ఎప్పటి నుంచో రావలసిన ధనం చేతికి వచ్చుట, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనారోగ్యం, శత్రువులపై విజయము కలుగును.

భాద్రపద మాసము (8th September to 6th October) : ఊహించని విధముగా ధనము ఖర్చగుట, దుర్వార్త వినుట, వాహన ప్రమాదములు, ప్రాణభయం, గౌరవ హాని, అధిక ఖర్చు, వ్యాపార నష్టం, సంతాన వలన ఆనందము నిచ్చును.

ఆశ్వీయుజ మాసము (7th October to 4th November) : అధిక శ్రమ, సోమరితనము, దేహపీడ, వైద్యము నిమిత్తము దూర ప్రాంతముల వెళ్ళుట, అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చు, శత్రు వృద్ధి కలుగును.

కార్తీకమాసము (5th November to 4th December) : అధిక శ్రమ వలన పనులు పూర్తి అగును. దేవాలయ దర్శనములు, పూజలు వ్రతములు చేయుట, భక్తితో పెద్దలను సాధువులను దర్శించుట, ఆనారోగ్యం కలుగును.

మార్గశిర మాసము (5th December to 2nd January, 22): ధైర్యంతో అన్ని కార్యక్రమములు పూర్తి చేయగలరు, మిత్రుల సహాయ సహకారములు లభించును, నూతన వాహన లాభము, ఆభరణము, వస్త్ర లాభము కలుగును.

పుష్య మాసం (3rd January, 22 to 1st February, 22) : ఇంటి మరమ్మతులు చేయించుట, వాహనములు వలన చిక్కులు, వృధాగా ధనం ఖర్చు పెట్టడం, తల్లి గారికి అనారోగ్యం, మాతృభక్తి, నూతన వ్యాపార కార్యాచరణ చేయుట జరుగును.

మాఘమాసం (2nd Februrary, 22 to 2nd March, 22) : దూర ప్రాంత ప్రయాణములు, ప్రయాణ లాభం, బంధుమిత్రుల సమాగమం, విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతాన రీత్యా సుఖము, ఉద్యోగ అభివృద్ధి కలుగును.

ఫాల్గుణ మాసం (3rd March, 22 to 1st April, 22) : ఋణములు చేయవలసి రావడం, ఊహించని విధంగా ఖర్చు, ధైర్యంతో కార్యాచరణ చేయుటవలన లాభము కలుగును. చతుష్పాద జంతువుల వలన ప్రమాదము, మనస్సుకు అశాంతి, శుభకార్యములలో పాల్గొనుట జరుగును.