politician fight

 

తెరాసలో ఆధిపత్య పోరు.. నేతల మధ్య పెరుగుతున్న దూరం

 

ఖమ్మం జిల్లాలో అధికార తెరాస నేతల మధ్య దూరం క్రమేణా పెరుగుతోంది. నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ ఇద్దరు ముగ్గురేసి నాయకత్వం తయారవడం.. ఒక దశలో తీవ్రస్థాయిలో వలసలను ప్రోత్సహించడం లాంటి కారణాలతో ఇప్పుడ పార్టీకి నేతలు మోయలేని భారంగా మారారన్న భావన కలుగుతోంది.

 

ఖమ్మం ( ప్రశ్న న్యూస్) జిల్లాలో దశాబ్దాల నుంచి రాజకీయంగా చక్రం తిప్పిన నేతల నుంచి మండల స్థాయి నాయకుల దాకా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ఆధిపత్యపోరు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వగా.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఖమ్మం ఎంపీ టికెట్‌ ఇవ్వడం.. అప్పటిదాకా తెరాస ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మొండిచేయి చూపడంతో పార్టీ వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడు జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వర్గం.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం.. ఎంపీ నామా నాగేశ్వరరావు వర్గంలతో బాటు.. ఇక నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడే వర్గపోరు తీవ్రరూపం దాలుస్తోంది.
పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా.. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస పరిస్థితి కనిపిస్తోంది. ఒక సిట్టింగ్‌ ఎంపీ సైతం ముందస్తు సదరు ఎమ్మెల్యేకు ముందస్తు సమాచారం లేకుండా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేని పరిస్థితి ఉందని తెరాస నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడే ప్రతిచోటా, ప్రతి స్థాయిలోనూ గ్రూపులు పార్టీకి తలనొప్పిగా మారినట్టు చెబుతున్నారు. జిల్లా స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇక నియోజకవర్గాలలో ఇంకా దారుణ పరిస్థితులున్నాయి. పాలేరులో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి తుమ్మలపై గెలుపొందిన కందాళ ఉపేందర్‌రెడ్డి మూణ్నెళ్లు తిరక్కుండానే తెరాసలో చేరడంతో అక్కడి క్యాడర్‌లో అలజడి మొదలైంది.
ఇక్కడ ఎమ్మెల్యే కందాళ, మాజీ మంత్రి తుమ్మల వర్గాలు బహిరంగంగానే సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న పరిస్థితి కామన్‌గా మారింది. దీనికితోడు ప్రతి గ్రామంలో తనకంటూ తన మనుషులను ఏర్పాటు చేసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం దాదాపు ఉమ్మడి జిల్లా అంతా పనిచేస్తూనే ఉంది. ఇక ఖమ్మంలో నిన్నమొన్నటి దాకా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాత్రమే అన్నట్టుగా ఉన్నా.. ఈ మధ్యనే జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో వర్గపోరు వెల్లడైంది. టికెట్ల కేటాయింపులో మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత ఎంపీ నామాకు ఏవిధమైన ప్రమేయం లేకుండా పోవడంతో ఫలితాలపై ప్రభావం పడిందన్నది తెరాస నాయకులు చెబుతున్న మాట. ఫలితాల వెల్లడి అనంతరం సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన పోస్టింగులు దీనికి ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిలో దాదాపు అందరూ తెరాస నేతల ప్రోద్బలంతోనే గెలిచారన్న ఫిర్యాదులు తెరాస అగ్రనాయకత్వానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇలా ఖమ్మంలోనూ కుంపటి మొదలైందని చెప్పుకోవచ్చు.
ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఆనక తెరాస తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుల మధ్య వర్గపోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఇది ప్రతి నిత్యం రగులుతునే ఉంది. ఇల్లెందులో కాంగ్రెస్‌ నుంచి గెలిచి తెరాసలో చేరిన హరిప్రియకు, ఓడిపోయి అనంతరం జడ్పీ ఛైర్మన్‌ అయిన కోరం కనకయ్యల మధ్య ఆదిపత్య పోరాటం నిత్యపోరుగా మారింది. ఇక సత్తుపల్లిలో తెదేపా నుంచి గెలిచి, ఆనక తెరాసలో చేరిన సండ్ర వెంకటవీరయ్య, ఆయనపైఓడిపోయి పొంగులేటి వర్గంలో కీలక నేతగా ఉన్న డాక్టర్‌ మట్టా దయానంద్‌ వర్గాల మధ్య రోజూ తలనొప్పే. వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు, స్వతంత్రునిగా గెలిచి తెరాసలో చేరిన రాములునాయక్‌ల మధ్య వివాదమే.
పినపాకలో కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన రేగా కాంతారావుకు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మధ్య వివాదమే. అశ్వారావుపేటలో తెదేపా నుంచి గెలిచి ఈ మధ్యనే తెరాసలో చేరిన మెచ్చా నాగేశ్వరరావుకు, మాజీ ఎమ్మెల్యే తాటికి మధ్య.. మధిరలో జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు వర్గానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి పోరు ముదురుతోంది.వాస్తవానికి మధిరలో కమల్‌రాజు గెలవాలన్న కసితో పనిచేసిన పొంగులేటి, అనంతర పరిణామాల్లో కమల్‌రాజు జడ్పీ ఛైర్మన్‌ కావడానికి సహకరించారు. అయినా వారి మధ్య దూరం పెరిగి, ఈ మధ్య తరచూ మండల స్థాయిలో వివాదాలు నెలకొంటున్నాయి. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా తెరాసలో వర్గపోరు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయం సామాన్య కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.