తెలంగాణలో పాగా కోసం బీజేపీ, ఈడీ దాడులు.?
తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోందా..? అందుకే వ్యూహాత్మకంగా కేంద్రం తెరాస నేతలకు చెక్ పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నదా..? ఒక్కొక్కరిపై వత్తిడి పెంచే క్రమంలో ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తున్నదా.. అంటేజరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తాజాగా తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ఇన్‌ఫ్రా కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల వెనుక మతలబు అదేనన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. దీని వెనుక ఈ మధ్యనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయి, తెరాసకు రాజీనామా చేసి తాజాగా భాజపాలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ షరతులు, డిమాండ్ మేరకే అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలా తెరాస పెద్దలను అదుపు చేయడానికి ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న దాడులేనా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏడేళ్ల కాలంలో తెలంగాణలో ఆర్థికంగా బాగా బలపడిన వారి జాబితాను, జరిగిన విచ్చలవిడి వనరుల దోపిడీ వివరాలను ఈటెల రాజేందర్ భాజపా పెద్దలను కలిసిన సమయంలో ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. ఇదే కనుక వారి వ్యూహం అయితే భవిష్యత్‌లో తెలంగాణలో తెరాసకు చెందిన మరికొందరు ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థల దాడులను, విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది రాజకీయ అంచనా. ఇదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో పెనుమార్పులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈటెల చేరికతో తెలంగాణలో భాజపాకు మరింత ఊపు తీసుకురావాలన్న కసి.. దీంతోటే తెరాసలోని నాయకత్వాన్ని కేసులు, దాడులు, విచారణల పేరిట భయబ్రాంతులకు గురిచేయాలన్న రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. అసలు నామా కేంసు ఏంటంటే.. తెరాస లోకసభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ఆఫీసులు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిపై ఈడీ ఒకే సారి దాడులు చేసింది.
వాస్తవానికి ఇది బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి నిధుల మళ్లింపు కేసు. 2019లోనే కేసు నమోదు అయి.. 2020లో ఛార్జిషీటు దాఖలైంది. సాధారణంగా ఏదైనా కేసులో న్యాయస్థానంలో ఛార్జిషీటు సమర్పించారు అంటే.. దర్యాప్తు సంస్థకు సంబంధించిన నివేదన దాదాపు పూర్తయినట్టే.. లేదు మరింత లోతుగా సమాచారం కావాలన్నా.. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, పత్రాలు కావాలన్నా.. అప్పటికే నమోదైన కేసు కనుక.. ఒక మెమో ఇచ్చి మరీ తెప్పించుకోవచ్చునన్నది ఇక్కడ ఓ పరిశీలన. ఒకసారి దాడులు చేసి.. దర్యాప్తు పూర్తయి.. ఛార్జిషీటు దాఖలు అయ్యాక సాధారణంగా దాడులు ఉండవు. కానీ ఇక్కడ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే రాజకీయ కోణం ఉందని అంటున్నారు. జార్ఘండ్ రాష్ట్రంలో ఓ నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకుల కన్నార్షియం నుంచి తీసుకున్న రుణం మొత్తంలో కొంత భాగాన్ని విదేశాలకు తరలించారని.. ఇది నిబంధనలకు విరుద్ధం కనుక కేసు నమోదైంది. 2011లో జార్ఘండ్ రాష్ట్రంలోని రాంచీ-రార్‌గావ్-జంషెడ్‌పూర్‌ల మధ్య 163 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును నేషనల్ హైవే 33గా అభివృద్ధి చేయడానికి రూ.1151 కోట్లకు బీవోటీ (బిల్ట్- ఆపరేట్- ట్రాన్స్ఫర్) పద్దతిలో మధుకాన్ ఇన్‌ఫ్రా కంపెనీ టెండర్‌ను చేజిక్కించుకుంది. దీనికోసం ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ఏర్పాటైంది. ఈ ఎస్‌పీవీకి కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకు కన్సార్షియం నుంచి రూ.1029.39 కోట్ల రుణం పొందారు. అయితే ఈ మొత్తంలో కొంత భాగాన్ని ఉద్దేశించిన వాటికి కాకుండా వేరే అవసరాలకు విదేశాలకు బదిలీ చేశారన్న ఆరోపణలపై జార్ఘండ్ హైకోర్టు విచారణకు ఆదేశించింది.
ఈమేరకు హైకోర్టు ఆదేశానుసారం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్‌వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు జరిపింది. మధుకాన్ కంపెనీ తాను ఈ నేషనల్ హైవే నిర్మాణానికి గానూ తీసుకున్నరుణంలో రూ.264.01 కోట్ల మొత్తాన్ని మళ్లించినట్టు నిర్ధరించింది. దీనిపై అప్పట్లో సీబీఐ కూడా దర్యాప్తు జరిపింది. ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తి కాలేదని, నిధుల పక్కదారి పట్టించడమే దీనికి కారణమని నివేదికలో పేర్కొంది. ఎస్‌పీవీ అయిన రాంచీ ఎక్స్‌ప్రెస్ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న కె.శ్రీనివాసరావు, ఎన్.సీతయ్య, ఎన్.ప్రథ్వీతేజలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీని ఆధారంగా సంబంధం ఉన్న మిగతా కంపెనీలపైనా మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది.
ఒత్తిడి పెంచడానికేనా..
వాస్తవానికి మధుకాన్ కంపెనీకి తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవస్థాపక ఛైర్మన్. అయితే ఆయన రాజకీయ ప్రవేశం అనంతరం ఆయన సోదరుడు నామా సీతయ్యకు అన్ని విషయాలలో ఆథరైజేషన్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుకాన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ 1990లోనే లిస్ట్ అయింది. మౌలిక రంగంతో పాటుగా, ఘుగర్స్, గ్రానైట్ ఇంకా విదేశాలలో బొగ్గు గనులు లాంటి పలు రకాల వ్యాపారాల్లో ఈ కంపెనీ ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావు వ్యాపారపరంగా, పారిశ్రామికంగా, రాజకీయంగా ఎదగడం.. గతంలో మాజీ సీఎం, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితునిగానూ, తెదేపాపా నేతగానూ పేరు సంపాదించారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2019లో తెరాస తీర్థం పుచ్చుకుని ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గతానుభవం, వాగ్ధాటి, విషయ పరిజ్జానం రీత్యా ఆయనకు తెరాస లోక్‌సభ పక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే ఢిల్లీలో బలమైన లాబీయింగ్ ఉన్న నామాను అదుపు చేయడం ద్వారా తెరాసకు ఓ హెచ్చరికను జారీ చేయొచ్చన్న విధంగా ఈ తాజా దాడులను ఆయన అభిమానులు, పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆర్థికపరమైన ఆరోపణలు ఏవైనా ఉంటే విచారణ తప్పులేదని, కానీ తాను రెగ్యులర్ వ్యవహారాలను చూడడం ఆపేసి దశాబ్దాలు పూర్తి కావచ్చినా ఇంకా ఆయన్ను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని చెబుతున్నారు. అయితే ఈ దాడులు ఇక్కడితో ఆగేవి కావని.. ఇంకా జాబితాలో ఉన్న కొందరిపైనా త్వరలో ఉంటాయన్న చర్చ కూడా సర్వత్రా జరుగుతోంది.