KTR

 

తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి

 

🔹హైదరాబాద్ లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్ యూనిట్
🔹ఫేజ్ 1 లో 483 కోట్ల పెట్టుబడి
🔹కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ముందడుగు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో సంస్థ ముందుకు వచ్చింది. పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకారం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో సౌరవిద్యుత్ ఉత్పత్తి పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ కొత్త ప్లాంట్ ప్రారంభించింది. మంత్రి సబిత ఇంద్ర రెడ్డి, మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈ ప్లాంట్ ను గురువారం ప్రారంభించారు. సుమారు నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ తో పాటుగా, ఈ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టు కూడా హైదరాబాద్ లోనే ఉండనున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 1200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లుగా ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సంస్థ యూనిట్ 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది .ఈ అత్యాధునిక ప్లాంట్ తో దేశంలో 5 పెద్ద సౌర విద్యుత్ పరికరాల తయారీ కంపెనీ లో ఒకటిగా ప్రీమియర్ ఎనర్జీస్ ఆవిర్భవిస్తుంది.

వచ్చే రెండేళ్లలో తమ సౌరవిద్యుత్ ఉపకరణాల వార్షిక ఉత్పాదక సామర్థ్యాన్ని 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్లకు విస్తరించనున్నట్లు గా సంస్థ వెల్లడించింది. ఈ ప్లాంటులో ఎంసీసిఈ మల్టీ టెక్చర్డ్ మల్టీ క్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్, మోనో పిఆర్సి సెల్స్, మాడ్యూల్స్, పాలీ క్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తి కానున్నాయి. మొత్తంమీద రెండేళ్లలో తెలంగాణలో పన్నెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి సంస్థ ఉత్పాదకత మరింత పెంచనున్నట్లుగా పేర్కొంది. పెట్టుబడి యొక్క రెండవ దశ మూడు నుండి నాలుగు నెలల్లో ప్రారంభమవుతుందని, ఇది పూర్తి కావడానికి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుందని సంస్థ అంచనా . దీని కోసం వివిధ పిఇ ప్లేయర్లు, గ్రీన్ రెన్యూవబుల్ ఫండ్స్ మరియు ఇతరులతో చర్చలు జరుపుతున్నామని ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా అన్నారు.తాము ఫేజ్ 1 లో రూ .483 కోట్ల పెట్టుబడితో 750 మెగావాట్ల సెల్ లైన్ మరియు 750 మెగావాట్ల మాడ్యూల్ లైన్‌ను ఏర్పాటు చేసామని చెప్పారు . ట్రయల్ ప్రొడక్షన్ ఇప్పటికే జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెట్టుబడుల వరద పారుతుంది. పారిశ్రామికంగా తెలంగాణా కీలక అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు , తెలంగాణా పారిశ్రామిక ఆదాయ పెరుగుదలకు, రాష్ట్ర ఉత్పత్తి సామర్ధ్యానికి తాజా పెట్టుబడులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా కేటీఆర్ తీసుకుంటున్న చొరవ, ఆయన వివిధ కంపెనీల పెట్టుబడుల విషయంలో అందిస్తున్న ప్రోత్సాహం వెరసి తెలంగాణాకు పెట్టుబడుల వరద కొనసాగుతుంది.