kc

 

తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్

 

🔹జిల్లాల వారీగా ఉద్యోగాలు..
🔹గురుకులాల్లో 50శాతం సీట్లు స్థానికులకే
🔹అధికారులకు కేబినెట్ కీలక ఆదేశాలు..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ కేబినెట్ రేపు కూడా కొనసాగనుంది. నేడు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం మొదలుకానుంది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కేబినెట్ సమావేశం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి కేబినెట్ సమావేశానికి అందరు కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రకాల పోస్టులతో ఖాళీలను గుర్తించిన తరువాత ప్రతీ సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం వార్షిక క్యాలెండర్‌ను తయారు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా.. సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు కోరారు. వారి విజ్ఞప్తిపై కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు.. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులకు కేబినెట్ ఆదేశించింది.

ఇక నిన్న జరిగిన కేబినెట్ భేటీలో పలు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతినెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఇక నెలలోపు వైకుంఠధామాలు పూర్తిచేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకు మూడోవైర్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో చర్చ జరగ్గా.. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం లాండ్ పూలింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా లే అవుట్లను అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన అవకాశాలను, విధివిధానాలను అన్వేషించాలని మున్సిపల్‌ శాఖ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.