DH Srinivas

 

తెలంగాణాలో కరోనా సెకండ్ వేవ్ ముగిసింది : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

 

🔹వర్షాకాలం సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
🔹అన్ని జ్వరాలు కరోనా కాదు
🔹ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 డెంగ్యూ కేసులు
🔹లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలి
🔹తెలంగాణలో తగ్గుతున్న కరోనా , శరవేగంగా వ్యాక్సినేషన్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే విషయాన్ని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండవ వేవ్ ముగిసినట్లేనని ఆయన వెల్లడించారు. అన్ని జ్వరాలను కరోనా జ్వరాలని అనుకోవద్దని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 0. 7 శాతంగా ఉందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం పోస్ట్ కోవిడ్ తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. దోమలు, లార్వా వృద్ధి నివారణా చర్యలను చేపట్టినట్టుగా వెల్లడించిన ఆయన సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్లను ఏర్పాటు చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సీజనల్ వ్యాధుల పరిస్థితిని వివరించారు. హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 డెంగ్యూ కేసులు వచ్చాయని పేర్కొన్న శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్ లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. డెంగ్యూ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను సిద్ధంగా ఉంచామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 13 జిల్లాలో మలేరియా డెంగ్యూ జ్వరాలు కేసులు వచ్చినట్లుగా నటించిన ఆయన జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జ్వరంతో పాటుగా కళ్ళు తిరగడం, విరోచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.65 కోట్లమందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.
56 శాతం మందికి మొదటి డోసు 34 శాతం మందికి రెండవ డోసు కూడా పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 90 శాతం ప్రజలకు మొదటి డోసు ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 417 కరోనా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేల కంటే దిగువకు చేరుకుంది. జగిత్యాల, కరీంనగర్, నల్గొండ జిల్లాలలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా దక్షిణాది రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా కట్టడిలో ఉండటం అందరికీ ఊరటనిచ్చే అంశం.