తెలంగాణ కాంగ్రెస్ బాస్ గా రేవంత్
🔹ఫైర్ బ్రాండ్ ప్రమాణ స్వీకారం
🔹హాజరైన కాంగ్రెస్ ప్రముఖులు
🔹తగ్గేదే లే అంటున్న కాంగ్రెస్ క్యాడర్
🔹రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా
🔹కేసీఆర్, మోదీపై రేవంత్ ఫైర్
🔹సోనియాకు కృతజ్ఞత చూపాల్సిన సమయం ఇది
అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. రెండేళ్లు కష్టపడితే ఇటు కేసీఆర్ ను, అటు మోడీని గద్దెదించడం ఖాయమన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై కృతజ్ఞత చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పార్టీ పగ్గాలు అందుకున్నారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. వరుణ దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ప్రసంగం ప్రారంభించిన రేవంత్.. తెలంగాణ దేవుళ్లు, దేవతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోల్చారు. పోచమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ తల్లులతో పాటు భద్రాద్రి రాముడు, యాదగిరి నర్సింహుడు, గద్వాల జోగులాంబ తల్లితో పాటు సోనియాగాంధీ ఆశీస్సులతో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.నాలుగు కోట్ల తెలంగాణ సమాజం, మేథావులు, కవులు, కళాకారులు, విద్యార్ధులు, యువత, రైతులు, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ రోజు నుంచి జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు మాత్రమే ఇవ్వాలన్నారు. మరో నినాదం ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని రేవంత్ వేదికపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగతమైన నినాదాలు ఇవ్వడం వల్ల పార్టీకిు నష్టమని రేవంత్ వ్యాఖ్యానించారు. నన్ను అభిమానించే వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా వ్యక్తిగతంగా నినాదాలు ఇవ్వొద్దన్నారు. 60 ఏళ్ల కలను సాకారం చేసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మాత్రమే అధికారం పరిమితమైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే తెలంగాణ తల్లి ఆశీర్వదిస్తుందని అనుకున్నామని, కానీ మన తెలంగాణ తల్లి రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ మాత్రమేననన్నారు. ఎందరు అడ్డుపడ్డా తెలంగాణ కల సాకారమైందంటే అది సోనియా వల్లేనన్నారు. ప్రతీ ఒక్కరూ తమ గుండెల్లో సోనియా గుడి కట్టుకుని పూజించాల్సిన అవసరం ఉందని, ప్రతీ ఇంట్లో సోనియా ఫొటో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని రేవంతె రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, రైతుల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ తెచ్చుకున్నామని, ఇవాళ అమరవీరుల కుటుంబాలు సమాధులకు వెళ్తే తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి డ్యాన్సులు చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ప్రతీ తండాల్లో., మారుమూలకు వెళ్లి కాంగ్రెస్ సందేశం అందించాలని కార్యకర్తల్ని రేవంత్ కోరారు. రెండేళ్లు కునుకు తీయకుండా కష్టపడితే ఈ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తనను అధ్యక్షుడిగా నియమించినప్పుడు దాసోజ్ శ్రవణ్ ట్విట్టర్ లో పెట్టిన ఓ మాట రేవంత్ గుర్తు చేసుకున్నారు. వేలాది మంది తన వెనకుంటే ఓ యుద్ధం గెలవచ్చని, కానీ ఆ నాయకుడు తమ ముందున్న విషయం వారు గుర్తిస్తే ప్రపంచాన్నే గెలవచ్చని రేవంత్ తెలిపారు.
కరోనా కంటే ప్రమాదకరమైన వారు కేసీఆర్, నరేంద్రమోడీలని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, మోడీల్ని పాతిపెట్టాలంటే వచ్చే రెండేళ్ల పాటు ప్రతీ కార్యకర్తా సొంత పనులు మానుకుని శ్రమించాలని రేవంత్ పిలుపునిచ్చారు. గతంలో లక్షా 7 వేల ఖాళీలున్నాయని చెప్పిన కేసీఆర్.. తాజాగా లక్షా 90 వేల ఖాళీలున్నాయని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఎన్ కౌంటర్లు ఆగలేదని, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోలేదని, ఉద్యమకారులపై కేసులు తొలగించలేదన్నారు. ఈ కులపిచ్చోళ్లను తెలంగాణ సరిహద్దుల వరకూ తరిమికొట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సీతను అపహరించేందుకు రావణుడు మారీచుడి రూపంలో మాయ లేడిగా వచ్చాడని, ఇప్పుడు తెలంగాణలో ఓ రావణుడు, మారీచుడు కలిసి తెలంగాణ తల్లిని ఫామ్ హౌస్ లో బంధించారని రేవంత్ విమర్శించారు. అప్పుడు సీతను రక్షించేందుకు రాముడు బయలుదేరితే వానర సైన్యం సహకరించిందని, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో బంధించిన తెలంగాణ తల్లిని విముక్తంచేసేందుతు తనకు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే సహకరించాలని రేవంత్ కోరారు.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తెలంగాణ కాంగ్రెస్ కు సలహాదారుగా పెట్టుకోవాలని చాలా మంది సలహా ఇస్తున్నారని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలే పాదరసంగా కదులుతూ పనిచేస్తున్నప్పుడు వారే తమకు పీకేలని రేవంత్ పేర్కొన్నారు. వారు ఉండగా తమకు పీకే అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారాలంటే కార్యకర్తలు పాదరసంగా మారి ప్రతీ తండాకూ, గూడానికి వెళ్లి చదువుకున్న యువకుల్ని జాగృతం చేయాలన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏపీలో చచ్చిపోయి, తెలంగాణలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ తెలంగాణ ఇచ్చిందని రేవంత్ గుర్తుచేశారు. పదేళ్లు అధికారం కోల్పోయినా నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవెర్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారని రేవంత్ తెలిపారు. తెలంగాణ గ్రామాల్లో పోతే దప్పిక వేస్తే గ్లాసు మంచి నీళ్లిస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని, అలాంటిది 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై లేదా అని రేవంత్ ప్రశ్నించారు.