congress dharna

 

తెలంగాణ కోసం త్యాగం చేసింది కాంగ్రెస్.. కేసీఆర్ కాదు

 

🔹ఖాసిం రిజ్వీలా వ్యవహరిస్తున్న ఐజీ ప్రభాకర్ రావు
🔹ఛలో రాజ్ భవన్ నేపధ్యంలో కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్
🔹చిల్లర దొంగల ఫోటోలు పోలీస్ స్టేషన్ లో..
🔹మరి మోదీ, కేసీఆర్ ల ఫోటోలు ఎక్కడ.?
🔹కేసీఆర్ నిలువు దోపిడీపై రేవంత్ ధ్వజం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ సూచనలతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ తీవ్రంగా ద్వజమెత్తారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే సమయంలో ఐజీ ప్రభాకర్ రావుపై మండిపడిన రేవంత్ రెడ్డి ఆయన ఖాసిం రిజ్వీలా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటిలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావుకు పోస్టింగ్ ఇచ్చారని, పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రికి ఈ విషయంలో ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ తో సహా ముఖ్య నాయకులు ఫోన్ లన్నింటిని ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

ఛలో రాజ్ భవన్ ను అడ్డుకుంటున్న క్రమంలో కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిని ఎక్కడ దాచిపెట్టారో తెలియడం లేదని పోలీసుల తీరుపై మండిపడ్డారు .ఈ రకమైన అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడితే సీఎం కేసీఆర్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు ముఖ్యమంత్రి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తే ఎవర్ని వదిలి పెట్టమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో బిజెపి, టిఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏడేళ్లలో 36 లక్షల కోట్ల పెట్రోల్, డీజిల్ పేరిట నరేంద్ర మోడీ దోచుకున్నారని విమర్శించారు. చిల్లర దొంగల ఫోటోలు పోలీస్ స్టేషన్ లలో పెడుతున్నారు కానీ పేదల సొమ్ము 36 లక్షల కోట్లు దోచుకున్న మోడీ, కేసీఆర్ ల ఫోటోలు పెట్టడం లేదంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ పాలకుల వల్ల బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం దోపిడీకి గురయ్యారని రేవంత్ ధ్వజమెత్తారు.

దేశానికి స్వాతంత్రం కావాలన్నప్పుడు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టలేదని, నిమ్స్ లో మంచిగా మందులు వేసుకొని మందు తాగుతూ పడుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి త్యాగం కాంగ్రెస్ ది కెసిఆర్ ది కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రెండుసార్లు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. గతంలో రెండు వంతులు అసలు ధర ఉంటే, ఒక వంతు పన్నులు ఉండేవని, ఇప్పుడు ఒక వంతు అసలు ధర ఉంటే , 2 వంతులు పన్నులు ఉంటున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. పక్కనున్న ఏ దేశాల్లోనూ ఇంధనం ధరలు ఇంతగా లేవని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసం అని చెప్పిన రేవంత్ రెడ్డి 40 రూపాయల పెట్రోల్ కి 65 రూపాయల పన్ను వసూలు చేస్తున్నారని, డీజిల్ ,గ్యాస్ ల విషయంలో కూడా సామాన్యుల నడ్డి విరగ్గొట్టేలా ధరలు ఉన్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.