KCR

 

త్వరలోనే పోడు భూములకు శాశ్వత పరిష్కారం..

 

🔹ఆదివాసీల ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం కేసీఆర్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అటవీ భూముల సర్వేను జరపడంతో పాటు, త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. పోడుభూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ సహోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవిబిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, స్వచ్ఛమైన, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని కొనియాడారు. స్వరాష్ట్రంలో ఆదివాసీలను స్వయం పాలనలో భాగస్వాములను చేసే దిశగా ఆదివాసీ గూడేలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని తెలిపారు. సర్పంచులయ్యే అవకాశం కల్పించి రాష్ట్ర రాజకీయ పాలనా వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేసిందన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నదన్నారు. మిషన్ భగీరథ ద్వారా అత్యంత సుదూరంలోని ఆదివాసీ గోండు గూడేలకు కూడా స్వచ్ఛమైన, శుద్ధిపరిచిన తాగునీరును అందించి నీటిద్వారా సంక్రమించే రోగాలనుంచి ఆదివాసీలను కాపాడుతున్నామన్నారు. ఆదివాసీ బిడ్డల విద్యకోసం ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వారికి అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నదని తెలిపారు. ఐఎఎస్ స్టడీ సర్కిల్ తో పాటు, వారికి ప్రత్యేకంగా స్పోర్ట్స్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. నివాస గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఆదివాసీ ఆవాసాలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. భారతీయ సాంస్కృతిక జీవనంలో ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి, దండలో దారమై ఇమిడిపోయివున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కుమ్రం భీం భవనాన్ని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైందన్నారు. ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వైతాళికుల విగ్రహాలను నెలకొల్పే క్రమంలో కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటుచేసుకుని, ఆదివాసీ పోరాట యోధునికి ఘన నివాళి అర్పించుకున్నామని సిఎం తెలిపారు.ఆదివాసీల సంస్కృతీ పరిక్షణకు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోనే మ్యూజియాలు ఏర్పాటు చేసిందన్నారు. తుపాకుల గూడెం బ్యారేజీకి సమ్మక్క పేరుతో గౌరవించుకున్నామన్నారు. ఆదివాసీల దేవతలైన సమ్మక్క – సారలమ్మ సహా.. నాగోబా, సేవాలాల్‌ మహరాజ్‌ జాతరలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ, జాతీయస్థాయిలో ప్రచారం కల్పిస్తున్నదన్నారు. ఆదివాసీలు సేకరించే, తేనె తదితర అటవీ ఉత్పత్తులకు గిరిబ్రాండ్‌ పేరుతో మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న ఆదివాసీ బిడ్డల కోసం, ‘గిరిపోషణ్‌’ పేరుతో పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. సిఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ షిప్ పథకం కింద పారిశ్రామికవేత్తలుగా ఆదివాసీ గిరిజనులను పారిశ్రామికవేత్తలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సిఎం కెసిఆర్ తెలిపారు.