KCR

 

దళితబంధుపై మరోసారి తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

 

దళితబంధు పథకాన్ని గత బడ్జెట్‌లోనే పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులు లేకుంటే గత ఏడాదే ఈ పథకాన్ని అమలు చేసి ఉండేవారమని తెలిపారు.

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవ్వరు అడ్డుపడ్డినా ఈ పథకం ఆగదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఒక పథకం కాదని.. ఒక మహా యజ్ఞమని సీఎం కేసీఆర్ అన్నారు. సమాజంలో పేదరికం, అసమానతులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు దళితులే అని అన్నారు. వారి జీవితాల్లో మార్పులు రావాలని అన్నారు. ఇందుకోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని అన్నారు. దళితబంధు పథకాన్ని గత బడ్జెట్‌లోనే పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులు లేకుంటే గత ఏడాదే ఈ పథకాన్ని అమలు చేసి ఉండేవారమని తెలిపారు. బీజేపీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా దళితబంధు పథకాన్ని అమలు చేసిన తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో పథకాలు తీసుకొచ్చామని.. వాటిని ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆ పథకాలకు సంబంధించిన ఫలాలను ప్రజలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అనేక పథకాలకు సంబంధించిన ప్రస్తావనను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజలెవరూ డిమాండ్ చేయకముందే తాము అనేక పథకాలు తీసుకొచ్చామని.. వాటి ద్వారా తెలంగాణ ముఖచిత్రం మారిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే అని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్.. రాష్ట్రంలో దళితుల జీవితాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కొందరు నానా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని కేసీఆర్ విమర్శించారు.