Harish Rao

 

దళితబంధు పథకంపై మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

 

దుబ్బాక ( ప్రశ్న న్యూస్) తెలంగాణలో దళిత బంధు పథకం కొత్తగా రాలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2021 అసెంబ్లీ బడ్జెట్‌లోనే దళితబంధు ప్రవేశ పెట్టామని తెలిపారు. దుబ్బాకలో ఇదే ఆర్థిక సంవత్సరంలో దళిత కుటుంబాలకు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.వచ్చే రెండు సంవత్సరాలలో దళిత బంధు పథకం పూర్తి చేస్తామని అన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యే బీజేపీలో ఉన్నా.. తెలంగాణ ప్రజలు కాబట్టి అభివృద్ధి మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం అందుతున్నాయని తెలిపారు. 2700 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రేషన్ బియ్యం పంచుతున్నామని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రతి పేదవారికి రేషన్ బియ్యం ఇస్తామని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణలోనే అని గుర్తు చేశారు.ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిరునామాగా మారిందని అన్నారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఓ రోల్ మోడల్ అని అన్నారు. అంబేద్కర్ భవనం, జగ్జీవన్ రామ్ భవన నిర్మాణాలకు ఒక్కో భవనానికి 50 లక్షల చొప్పున రూ.1కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి ప్రహరీ గోడ, సీఎం కేసీఆర్ చదివిన స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. దుబ్బాకలో శంఖుస్థాపన చేసిన నూతన బస్టాండ్ కు మరిన్ని నిధులు అవసరమని దృష్టికి తెచ్చారని, అవసరమైన నిధులు సమకూరుస్తానని అన్నారు.