KCR Dalit Bandhu

 

దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు..

 

🔹సామాజిక వివక్షకు స్వస్తి
🔹పలు దశల్లో దళిత బంధు..
🔹దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో కేసీఆర్

 

హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ వేదికగా దళిత బంధు పథకం ప్రారంభోత్సం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు అందజేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న దళితులకు కూడా దళిత బంధు వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. తొలుత ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తున్నామని.. ఇది పథకానికి ప్రయోగశాల వంటిందని అన్నారు. ఇక్కడ సాధించే అభివృద్ది తెలంగాణలో దళిత బంధు అమలకు ఆదర్శం కావాలి అన్నారు. దళిత బంధు అమలుతో.. భార‌తదేశంలోని ద‌ళిత జాతి మేల్కొంటుందని. ఉద్య‌మ స్ఫూర్తి వ‌స్తుందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్నట్టు లెక్కలు ఉన్నాయని.. ఇప్పటికే రూ. 500 కోట్లు విడుదల చేశామని, రాబోయే 15 రోజుల్లో మరో రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా దళితులందరికీ దళిత బంధు పథకం అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్ఛయ్యేది రూ. 1.30 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. నిధులకు భయపడకుండా దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ బొజ్జాను సీఎంవోలో కార్యదర్శిగా నియమిస్తున్నట్టు చెప్పారు. దళిత బంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చని అన్నారు. దళిత బంధు కింద ఇచ్చే డబ్బులకు కీస్తిల కిరికిరి లేదన్నారు. దళిత బంధు డబ్బులు 100 శాతం సబ్సిడీతో ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధు నిధులతో ఎక్కడైన సరే వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు.

రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎస్సీలదేనని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ అతి తక్కువ ఆస్తులు, ఉపాధి, ఆదాయం ఉన్న వారు కూడా ఎస్సీలేని తెలిపారు. ఇక, పలు దశల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. మొదటి వరుసలో ఈ పథకాన్ని నిరూపేదలకు అందజేయనున్నట్టుగా తెలిపారు. దళితుల్లో పస్తులు ఉండేవారు చాలా మంది ఉన్నారు.. అలాంటివారికి మొదటి వరుసలో దళిత బంధు ఇవ్వనున్నట్టు చెప్పారు. రెండో వరుసలో కొద్దిగా నయమైన స్థితిలో ఉన్నవారికి, మూడో వరుసలో మరింత మెరుగైన స్థితిలో ఉన్నవారికి దళిత బంధు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులైన దళితులకు కూడా చివరి దశలో దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చివరి దశలో పథకాన్ని తీసుకోవాలని కోరారు. గతేడాదే దళిత బంధు పథకం అమలు చేయాల్సి ఉండిందని.. అయితే కరోనా కారణంగా వాయిదా పడిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బంధు తరహాలోనే దళిత బంధు అమలు చేయనున్నట్టుగా చెప్పారు. దళిత బంధు నిధులతో నచ్చిన స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. దళితబంధు నిధుల ఖర్చుపై ప్రభుత్వ సమీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు కమిటీలు వేస్తామని చెప్పారు. 1.25 లక్ష మంది ప్రజాప్రతినిధులు దళితబంధును సమీక్షిస్తారని చె్పారు. రూ.25 వేల కోట్లతో దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. దళితులు బాగుపడనంత కాలం సమాజం బాగుపడదని సీఎం అన్నారు.