KCR

 

దళిత బంధు – పథకం పేరుపై అభ్యంతరం

 

🔹ఎందుకీ కొత్త వివాదం..?
🔹దళిత పదంపై భిన్నాభిప్రాయాలు…
🔹మొదట దళిత సాధికారతగా…
🔹సర్కార్‌కు ఎస్సీ కమిషన్ నోటీసులు
🔹నివేదిక ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం…

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న ‘దళిత బంధు’ పథకం పేరుపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆ పేరుకు బదులు ‘అంబేడ్కర్ బంధు’ అనే పేరు వాడాలని మాల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ సర్కార్‌కు కమిషన్ తాజాగా నోటీసులిచ్చింది. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. జాతీయ ఎస్సీ కమిషన్‌లో మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ పిటిషన్ మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. దళిత అనే పదానికి అంటరానివారు,తక్కువ వారు,నిస్సహాయులు అనే అర్థాలు ఉన్నాయని బత్తుల రామ్ ప్రసాద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి ఆ పేరుకు బదులు అంబేడ్కర్ బంధు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.దళిత అనే పదం ఆత్మగౌరవమా… అవమానకరమా అనే చర్చ చాలా కాలంగా ఉన్నదే.రెండేళ్ల క్రితం బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్… టీవీ ఛానెళ్లు ‘దళిత’ అనే పదానికి బదులు షెడ్యూల్ కాస్ట్ పదాన్ని ఉపయోగించాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ప్రకటనలు,పత్రాలు, ఉత్తర-ప్రత్యుత్తరాల్లో ‘దళిత్‌’ పదాన్ని తొలగించాలని కోరుతూ అప్పట్లో పంకజ్‌ మెష్రాం అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. మీడియా కూడా దళిత్‌ అనే మాట వాడకుండా ఆదేశాలివ్వాలన్నారు.తాజాగా బత్తుల రామ్ ప్రసాద్ తన పిటిషన్‌లో ఏవైతే పేర్కొన్నారో… అప్పట్లో పంకజ్ మెష్రాం కూడా అదే పేర్కొన్నారు. రాజ్యాంగంలో దళిత అనే పదమే లేదని.. అలా పిలవడం కించపరచడం లాంటిదేనని అన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ‘దళిత్‌’కు బదులు ‘షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పట్లో సర్క్యులర్లు జారీ చేసింది. అలాగే ప్రెస్‌ కౌన్సిల్‌కు, మీడియాకు కూడా ‘దళిత్‌’ అనే మాట వాడరాదని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను కొందరు సభ్యుల బృందం సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. బహుజన మేదావి,సామాజికవేత్త కంచ ఐలయ్య గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ… దళిత అనే భావన ఒక కులానికి పేరును సూచించేది మాత్రమే కాదన్నారు. అది బ్రాహ్మణ ఆధిపత్య భావజాలన్ని ఢీకొట్టగలదని అన్నారు. దేశంలో అణచివేతకు గురైన కులాలన్నింటినీ ఏకం చేసిన భావనగా దానికి గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మొదట దళిత సాధికారత పథకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. సుదీర్ఘంగా 10 గంటల పాటు చర్చించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని దళిత బంధుగా ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన దళితులకు ఈ పథకం ద్వారా రూ.10లక్షలు నగదు అందించనున్నట్లు ప్రకటించారు. పైలట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో అమలుచేస్తామన్నారు. కానీ అంతకన్నా ముందే వాసాలమర్రి గ్రామంలో దీన్ని అమలుచేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.అర్హులైన అక్కడి దళితులకు గురువారం(అగస్టు 5) వారి ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ పథకం విధి విధానాలను ఖరారు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ హామీలను నెరవేర్చలేకపోయిన కేసీఆర్.. దీన్ని కూడా పూర్తి చేయకుండానే వదిలేస్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికకు ముందే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని అమలుచేయాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో దీన్ని ఎన్నికల స్టంట్‌ గానే భావించాల్సి వస్తుందని అంటున్నాయి.

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఆరు నూరైనా దళిత బంధును అమలుచేసి చూపిస్తామని కేసీఆర్ అంటున్నారు. దేశంలో ఇప్పటివరకూ ఇలాంటి పథకమేదీ అమలు లేదు. ఒకవేళ ఈ పథకం అమలైతే ఆర్థికంగా దళితులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. అయితే రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉండగా.. 12 లక్షల పైచిలుకు కుటుంబాలు ఇందుకు అర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్ని లక్షల మందికి దళిత బంధు అమలు చేయాలంటే రూ.1లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.2లక్షల పైచిలుకు కోట్లు. అంటే,దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో సగం వెచ్చించాల్సి ఉంటుంది.దీంతో ఇంత భారీ స్థాయిలో నిధులు వెచ్చించి ఈ పథకాన్ని అమలుచేయడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రూ.1లక్ష కోట్లు ఖర్చైనా సరే అమలుచేస్తామని చెబుతున్నారు. దళిత బంధు పథకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఉపఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా ఉంది.ఈ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఉపఎన్నిక పూర్తయ్యే వరకు హుజురాబాద్‌లో దీన్ని అమలు చేయకుండా ఆపాలని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పథకంపై ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర రిపోర్టును తమకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను ఈసీ ఆదేశించింది. ఈసీ ఆర్డర్స్ మేరకు వెంటనే దళిత బంధుపై రిపోర్టు ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్‌ను సీఈఓ ఆదేశించారు.