jagan

 

దిశ బిల్లుల ఆమోదానికి జగన్ మరో ప్రయత్నం

 

🔹స్మృతీ ఇరానీకి జగన్ లేఖ
🔹పోలీసు స్టేషన్లకు బదులు సచివాలయాలకే బాధితులు
🔹త్వరలో 18 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల్ని అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లులు కేంద్రానికి ఆమోదం కోసం పంపింది. వాటికి ఇప్పటివరకూ ఆమోదం లభించలేదు. దీంతో సీఎం జగన్ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. దిశ బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి స్మతీ ఇరానీకి రాసిన లేఖలో జగన్ దిశ బిల్లుల నేపథ్యంలో, కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆలోపు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు అరికట్టేందుకు వైసీపీ ప్రభుత్వం 2019లోనే రెండు దిశ బిల్లుల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వీటికి అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకుంది. ఆ తర్వాత ఏపీ దిశ బిల్లు 2020 ( ప్రత్యేక కోర్టుల ఏర్పాటు), ఏపీ దిశ- క్రిమినల్ చట్టం సవరణ బిల్లు 2019ని కేంద్రం ద్వారా రాష్రపతి ఆమోదానికి పంపింది. అయితే కేంద్రం వాటిని తిప్పిపంపడంతో తిరిగి వాటిలో సవరణలు చేసి ఆమోదం కోసం పంపారు. అయితే ఇప్పటికీ వాటికి ఆమోదం లభించకపోవడంతో సీఎం జగన్ ఇవాళ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఇందులో దిశ బిల్లుల్ని ఆమోదించాల్సిన అవసరాన్ని కేంద్రానికి గుర్తు చేశారు.

ఏపీలో మహిళలు, చిన్నారులపై చోటు చేసుకుంటున్న అఘాయిత్యాల నేపథ్యంలో దిశ బిల్లుల ఆమోదం కోసం సీఎం జగన్ కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఇవాళ లేఖ రాశారు. ఇందులో దిశ బిల్లుల ద్వారా ఏర్పాటు చేస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాల్ సెంటర్లు, మహిళా పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు, హెల్ప్ డెస్క ల ఏర్పాటుతో పాటు పలు చర్యల్ని ప్రస్తావించారు. ఈ చట్టాలు అమల్లోకి రాక ముందే ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకున్న చర్యల్ని సైతం ఇందులో సీఎం జగన్ స్మతీ ఇరానీకి గుర్తు చేశారు. కాబట్టి ఈ బిల్లుల్ని పరిశీలించి రాష్టపతి ఆమోదం కోసం తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని తన లేఖలో జగన్ కోరారు. మరోవైపు రాష్ట్రంలో దిశ అమలుపై ఇవాళ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను క్రియాశీలంగా ఉంచాలని, ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు పోలీసు స్టేషన్లకు కాకుండా సచివాలయాలకే వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. జీరో ఎఫ్ఐర్ నమోదు అవకాశాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దిశయాప్‌ల్లో ఉన్న అన్ని ఫీచర్లపైనా మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన, శిక్షణ కల్పించాలని జగన్ కోరారు. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లాకలెక్టర్, ఎస్పీలు సమావేశమై ప్రజాసమస్యలతోపాటు, మహిళల భద్రతపైనా సమీక్ష చేయాలన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్‌ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. రిసెప్షన్‌ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా చూడాలని సీఎం ఆదేశించారు. ‘దిశ’ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పోలీస్‌స్టేషన్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించాలని సీఎం పేర్కొన్నారు. అలాగే బాలలపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. 181 విమెన్‌ హెల్ప్‌లైన్‌ను దిశకు అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ‘‘దిశ” కాల్‌సెంటర్లో అదనపు సిబ్బంది ద్వారా బలోపేతానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టంచేశారు. దిశ పెట్రోలింగ్‌కోసం కొత్తగా 145 స్కార్పియోల కొనుగోలుకు సీఎం ఆమోదం. తెలిపారు. విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు వీటితోపాటు ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన పోలీస్‌స్టేషన్లకు ఈ వాహనాలు. పంపనున్నారు. రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్‌స్టేషన్ల నిర్మానానికి సీఎం అంగీకారం తెలిపారు. వీటికి సంబంధించిన నిధులను త్వరగా విడుదలచేయాలని ఆదేశించారు. ‘‘దిశ”కింద నమోదవుతున్న కేసుల పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోరెన్సిక్‌ ల్యాబుల్లో ఇప్పటికే 58 పోస్టులు భర్తీ చేయగా.. మరో 61 మందిని నియమించడానికి సీఎం అంగీకారం తెలిపారు. వీటితోపాటు తిరుపతి, వైజాగ్‌ల్లో (సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌)ల్యాబ్‌ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అనంతపురం, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడల్లో మూడేళ్లకాలంలో స్పెషల్‌ అసిస్టెన్స్‌ కింద దిశ ల్యాబుల నిర్మాణం చేపట్టనున్నారు.