Dhanu Rasi Phalalu 2022-2023

ధనస్సు (Sagittarius) 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Sagittarius/Dhanu/ధనూరాశి

(మూల: 1,2,3,4 పాదములు, పూర్వాషాఢ: 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ: 1 పాదము)
(ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 06 అవమానం – 01)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి చతుర్ధ స్థానమందు, తామ్రమూర్తి సామాన్య ఫలములను, శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి తృతీయస్థానమందు కుంభరాశిలో లోహమూర్తిగా సంచరించును. రాహుకేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా పంచమ, ఏకాదశ స్థానములందు రజితమూర్తులుగా సంచరింతురు.

ఈ రాశివారికి ఇంకను ఏలినాటి శని దుష్ప్రభావము పోలేదు. అయితే గతములో కంటే ఆశాజనకముగా యుండును. అకారణముగా ఇతరులతో విరోధము సూచించును గాన తగువిధముగా జాగ్రత్త అవసరము. చేయుపనులు సాఫీగా సాగవు మధ్యలో అవాంతరములకు అవకాశము లేకపోలేదు. మానసిక, శారీరక రుగ్మతలు కలుగును. నిందారోపణలు ఎదుర్కొన వలసివచ్చును.

Know More Sagittarius/Dhanu/ధనూరాశి

ధనూరాశి వారికి చతుర్ధ స్థానమందు గురుడు విద్యావిషయూలలో వినూత్నంగా అలోచించి తెలివితేటలూ స్వశక్తి సామర్ధ్యాలపై ఆధారపడి ఇతరుల అవసరం లేకుండా జీవనమున ఉన్నతి సాధిస్తారు. మీలో దాగిఉన్న సృజనాత్మకశక్తి, కుశాగ్రబుద్ధికి గురుబలం తోడై మిమ్ములను ఉన్నత శిఖరాలకు జేరునట్లు చేస్తుంది. గృహ నిర్మాణ విషయాల్లో రాణిస్తారు. మీ చురుకుదనానికి ఖచ్చితత్వానికి, క్రమశిక్షణకు, యోగాభ్యాసానికి దైవశక్తి తోడై అన్ని రంగాలలోనూ రాణించగల్గుతారు. ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు. అంతర్జష్టి పెరుగును. కళాత్మక ప్రేరణ కల్గుతుంది. సర్వభూతాలపై తాదాత్మ్యం మరియు కరుణ పెరుగుతుంది.

ధనూరాశివారికి 4వ స్థానమందు మీనరాశిలోని బృహస్పతి సంచరిస్తున్నందున, మీరు అత్యంత సాహసములు చేసి సమస్త విజయములను సాధించగల్లుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో గాని గృహ నిమిత్తంగాని స్థానచలన అవకాశమును సూచిస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఒకచోట ఉండటానికి మంచి సమయం. స్థానమార్పు మీకు అనుకూలం అవుతుంది. సంతాన విషయంలో ఉన్నతి సాధిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మెడ నరములు, వెన్నెముక కందడరముల నొప్పులు సంవత్సర ఆరంభంలో మిమ్ములను వేధిస్తాయి. ఈ సంవత్సరంలో రాజకీయంగా ముందంజ వేస్తారు. ఈ రాశివారు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేసిన దోష నివారణ యగును.

మూల నక్షత్రంవారికి ఇంటికి పడమర నైరుతి దిక్కులలో వ్యాపారాలు కలసివస్తాయి. నియమబద్ధమైన జీవన విధానంతో ముందుకు సాగెదరు. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రముల వారు సూర్య ఆరాధన చేయుట మంచిది.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘3’, 1,2,5,9 తేదీల సంఖ్యలు ఆది, బుధ, గురు వారములు కలసిన మేలు కలుగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: జీవనవిధానం మెరుగవుతుంది. గతంలో స్తంభించిన లావాదేవీలు ఒక కొలిక్కివస్తాయి. కొత్త ఆస్తులను సంపాదిస్తారు. భూగృహ మార్పులను సూచిస్తోంది. కుటుంబం కోసం సద్వ్యయం చేస్తారు. గౌరవం పెరుగుతుంది.

మే: ఉద్యోగములలో ఇబ్బందులు, పై అధికారుల వలన ఇబ్బందులు, ఉద్యోగము ఊడినంత పనగును. ధనధాన్య లాభములు, మెట్ట వ్యవసాయములు అధికంగా ఫలవంతమవడం, ధనధాన్యవృద్ధి, ధనం నిల్వలో ఉంటుంది.

జూన్‌: వస్త్రలాభములు, గ్రహస్థితి అనుకూలం శత్రుజయము కల్గుతుంది. నూతనంగా పెట్టుబడులు అనుకూలిస్తాయి. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పనిపై దృష్టి సారిస్తూనే ఉంటారు. శుభకార్యాచరణ ఉంటుంది. ధైర్యంతో సాధిస్తారు.

జూలై: రాజకీయంగా ఉన్నతికోసం తహతహలాడతారు. కలసివచ్చే కాలం, నిర్మాణాలు కలసివస్తాయి. శరీర ఆరోగ్యంపై దృష్టి అవసరం. వృత్తి వ్యాపారాలు కలసివస్తాయి. చేపల చెరువులు మేతలు సంబంధ వ్యాపారాలు కలసివస్తాయి.

ఆగష్టు: గ్రహస్థితి అనుకూలం ఇతరులపై మీ ప్రభావము అమోఘము, ధనము నిల్వ వాగ్గాటి పెరుగుతుంది, కార్యజయం సాధిస్తారు. రాజకీయంగా నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీరే మార్గదర్శకులవుతారు.

సెప్టెంబర్: అపరాధము లేకుండా ద్రవ్యము నశించుట, వ్యాపారముల నడక సామాన్యము. తన కులాచారమును జరుపుట, గురుభక్తి, సత్సాంగత్యము లేర్పడుట, యోగాభ్యాసము మొదలగు విషయాల్లో దృష్టిని పెడతారు.

అక్టోబర్‌: గృహ నిర్మాణాలు కలసివస్తాయి. ఆర్థికంగా ముందంజ, ఎంతటి ఖర్చునైననూ లెక్క చేయరు. వృత్తి వ్యాపారాలు కలసి వచ్చే సమయం, గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ సహాయం కోరేవారు మీకు మంచి చేస్తారు.

నవంబర్‌: అధిక ఆదాయం కల్గుతుంది. లాభన్థానమందు రవి బుధ శుక్ర కేతువులు అన్ని గ్రహాలూ మంచి ఫలితాన్నిస్తాయి. భవిష్యత్తుకి బాటలు వేస్తాయి. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది.

డిసెంబర్‌: దూరప్రయాణాలు తగ్గించుకొనుట మంచిది. ధృడమైన సంకల్పంతో కార్యదీక్ష ప్రారంభిస్తారు, సత్ఫలితాన్నిస్తుంది. రాజకీయంగా ఇతరులను శాసించి పనులు చేయించుకుంటారు. ఇతరులకు ప్రయోజనకారి అవుతారు.

జనవరి 2023: నూతన పరిచయాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యా విషయాల్లో శ్రద్ధ చూపి భవిష్యత్తుకి పునాది వేస్తారు. ప్రతిభా పురస్కారాలను గెలుచుకుంటారు. బహుమతులు గెల్బుకుంటారు. సంపద వృద్ధి అవుతుంది.

ఫిబ్రవరి: వాగ్భూషణమే భూషణం. ఇతరులను గౌరవించడమనే ముఖ్య ఆశయం మిమ్ములను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సరైన చోట ఇతరులను ప్రభావితం చేసేలా గంభీరంగా మాట్లాడి నాయకత్వ లక్షణాలు పెంచుకుంటారు.

మార్చి: ధైర్యము, ప్రణాళిక, దైవబలం, సదుద్దేశంతో మీ పనులు విజయవంత మవుతాయి. ఇతరులకు సహాయకారిగా యుండడమే గాక మార్గదర్శకులవుతారు. విద్యా విషయాలు వృత్తి ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

** ** **