నయా నిజాం కేసీఆర్ నియంతృత్వం
🔹నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్
🔹ఆరిపోయే దీపం అనుకున్నాడు… కానీ..
🔹కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక
🔹ఆత్మగౌరవం కొనుక్కుంటే దొరికే సరుకు కాదు
హుజురాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ ఉపఎన్నిక కురుక్షేత్ర సమరం అని అభివర్ణించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇది ధర్మానికి,అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని… తప్పక న్యాయమే గెలుస్తుందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందన్నారు. దానికి హుజురాబాద్ ఉపఎన్నికే నాంది అన్నారు. ఈ ఉపఎన్నిక కేవలం ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించే ఎన్నిక కాదన్నారు. కేసీఆర్ అహంకారాన్ని పాతరేస్తమని పంపించే సంకేతమని… ఆయన పంపించే డబ్బు సంచులకు కాలం చెల్లిందని చెంప మీద కొట్టి చెప్పే ఎన్నిక అని పేర్కొన్నారు. నయా నిజాం కేసీఆర్ నియతృంత్వం ఈ గడ్డ మీద ఇక చెల్లదని చెప్పే ఎన్నిక అన్నారు. ప్రజా దీవెన యాత్రలో భాగంగా శనివారం(జులై 24) ఇల్లంతకుంటలో ఆయన మాట్లాడారు. ‘ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు… ఆయనకు మనిషులే దొరకద్దు… ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక నన్ను సంపుకుంటరా… సాదుకుంటరా అన్నది మీ చేతుల్లో ఉన్నది. రాజకీయంగా కొట్లాడాల్సిందిపోయి మనుషులు కొనుక్కునే స్థాయికి కేసీఆర్ దిగజారిండు. నా బొమ్మ పెట్టుకుని,నా పేరు చెప్పుకుని,నేను బీఫామ్ ఇస్తే రాజేందర్ గెలిచిండని కేసీఆర్ అంటున్నాడు. మరి అదే బీఫామ్,అదే జెండాతో పోటీ చేసిన నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావు. నా ఉద్యమ సహచరుడు వినోద్ కుమార్‌ను ఎందుకు గెలిపించుకోలేకపోయావు.’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
‘కేసీఆర్ నన్ను ఆరిపోయే దీపం అనుకున్నాడు. కానీ ఆయన్నే ఆరిపోసే దీపమని ఇప్పుడు అర్థమైంది. ఉద్యమ కాలంలో ప్రజలను,ధర్మాన్ని,చైతన్యాన్ని నమ్ముకున్న కేసీఆర్… ఇవాళ డబ్బు,దౌర్జన్యం,అహంకారాన్ని నమ్ముకున్నాడు. నయా నిజాంలా వ్యవహరిస్తున్నాడు.ఆ పార్టీలో ఎమ్మెల్యేలు గంగిరెద్దులతో సమానం. మంత్రులను మంత్రులుగా కాకపోయినా కనీసం మనుషులుగా చూడమని వేడుకునే పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… ఒకవేళ గనుక నా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే.. ఎమ్మెల్యేలకు,మంత్రులకు స్వేచ్చ ఇస్తే… నన్ను ఏకాన కొత్తలకు కోఠి చౌరస్తాలో అమ్ముకొస్తారు అని అన్నాడు.’ అని ఈటల చెప్పుకొచ్చారు. ‘అసలు రాజ్యాంగమేందీ… అంబేడ్కర్ దీన్ని ఎందుకు రాశాడు… 119 నియోజకవర్గాలేందీ… అలా కాకుండా అన్ని నియోజకవర్గాల ప్రజలతో నాకే డైరెక్ట్ కనెక్షన్ ఉంటే బాగుండని కేసీఆర్ అనుకుంటుంటాడు. తానొక్కడినే మేదావిని అని భావిస్తాడు. ఇవాళ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెబుతారు కేసీఆర్ అహంకారం గురించి. ఇక కేసీఆర్ పాలన రాష్ట్రానికి ఏమాత్రం క్షేమం కాదని,అరిష్ఠమని ప్రజలు భావిస్తున్నారు. 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. దానికి ఇక్కడి నుంచే నాంది పడుతుంది. ఈ ఉపఎన్నిక నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే ఎన్నిక మాత్రమే కాదు… కేసీఆర్ అహంకారాన్ని పాతరేస్తమని చెప్పే ఎన్నిక. డబ్బు సంచులకు కాలం చెల్లింపోయిందని చెంప మీద కొట్టే ఎన్నిక. నయా నిజాం నియంతృత్వం ఇక చెల్లదని చెప్పే ఎన్నిక.’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే తనను ఓడగొట్టేందుకు కుట్ర జరిగిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.ఓవైపు టీఆర్ఎస్‌ను గెలిపించాలని తాను తిరుగుతుంటే… తనను ఓడించేందుకు ప్రత్యర్థులకు డబ్బు సంచులు పంపించారని ఆరోపించారు. ఆనాడు హుజురాబాద్ గడ్డపై తాను ఆక్రోశిస్తే ప్రజలు 47వేల మెజారిటీతో గెలిపించారని చెప్పారు. కంచె చేను మేసిన చందంలా టీఆర్ఎస్ వ్వవహరించిందన్నారు. ఆత్మగౌరవం కొనుక్కుంటే దొరికే సరుకు కాదని… అది అంబేడ్కర్ ఇచ్చిన హక్కు అని అన్నారు. గుడిసెలో ఉన్నోడికైనా,బంగ్లాలో ఉన్నోడికైనా ఒకే ఓటు అంబేడ్కర్ ఇచ్చాడని… ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం ఇక మీ చేతుల్లోనే ఉందని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ ప్రకటించే పథకాలన్నీ ఓట్ల కోసమే తప్ప పేదలపై ఆయనకు ప్రేమ లేదన్నారు.