నిరుద్యోగులకు కొండంత అండ
🔹వైఎస్ షర్మిల సంచలనం నిర్ణయం
🔹నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్ష
🔹నోటిఫికేషన్లు జారీ చేసేవరుకు కొనసాగిస్తానని వెల్లడి
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఇక జనం బాట పట్టింది. నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను పూర్తిస్థాయిలో సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఖాళీగా ఉన్నట్లుగా చెబుతోన్న లక్షా 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ఒత్తిడిని తీసుకొచ్చే దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఇదివరకు- జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. దాన్ని కొనసాగించబోతోందా పార్టీ. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వైఎస్సార్టీపీ నేతలు పిట్ట రాంరెడ్డి, ఏపూరు సోమన్న, ఇందిరా శోభన్ ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందని, అధికారాన్ని అందుకున్న తరువాత తన మూలాలను విస్మరించేలా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో లక్షలాదిగా ఖాళీలు ఉన్నప్పటికీ..ముఖ్యమంద్రి కే చంద్రశేఖర్ రావుకు వాటిని భర్తీ చేయాలనే సోయి లేకుండా పోతోందని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాము ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టబోతోన్నట్లు పిట్ట రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారిపోతాయనే ఆలోచనతో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ సిద్ధించి ఏడు సంవత్సరాలైనప్పటికీ.. నిరుద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటోన్నా కనికరం చూపట్లేదని, దున్నపోతు మీద వర్షం పడినట్లు ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. తమ నాయకురాలు వైఎస్ షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగులెవరూ నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిట్ట రాంరెడ్డి సూచించారు. నిరుద్యోగుల తరఫున వైఎస్ షర్మిల పోరాడుతారని అన్నారు. వచ్చే రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలని చెప్పారు. రెండేళ్ల తరువాత వైఎస్సార్టీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. వైఎస్ షర్మిల నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తెలంగాణ సమాజం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రతి మంగళవారం ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
తాము కోరుకున్న తెలంగాణ ఇది కాదని ఏపూరి సోమన్న అన్నారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడారని అన్నారు. 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. తెలంగాణ యువత ఎవరూ నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. కొట్లాడి తెలంగాణను సాధించామని, రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉందని అన్నారు. మాట ఇస్తే.. దాని కోసం ఎంతకైనా తెగించి పోరాడే వైఎస్సార్ కుటుంబం వారసురాలు వైఎస్ షర్మిల యువతకు అండగా ఉంటారని చెప్పారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఏపూరి సోమన్న అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ మంగళవారం వైఎస్ షర్మిల వనపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఇంకా పార్టీ నాయకులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.