నీటిపారుదలపై సీఎం సమీక్ష

🔹ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కీలక ఆదేశాలు
🔹జూన్ 15 నాటికి అంచనాలకు సిద్ధం చేయాలని సూచన

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ లిప్టుకు ఆ లిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వాన కాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా ఉన్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండివుండడంతో భుగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సీఎం చెప్పారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కాబట్టీ వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు.

బంగారు తున‌క‌గా ఖ‌మ్మం మారుతుంది..

ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు దాకా నీటికొరత లేకుండా చేశామన్నారు. హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామలకు మల్లన్న సాగర్ వరంలా మారనున్నదని సీఎం తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందనీ, దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు సూచించారు.

కృష్ణా, గోదావ‌రి బేసిన్లలోని ప్రాజెక్టుల పురోగ‌తిపై సీఎం స‌మీక్ష..

మైలారం ట్యాంకునుంచి సూర్యాపేట తుంగతుర్తి దిక్కుగా కాళేశ్వరం నీటిని తీసుకపోయే డీబీఎం 71 కాల్వ లైనింగ్ పనులను చేపట్టాలని సీఎం ఆదేశించారు. హల్దీవాగు ప్రాజెక్టు కాలువ అధునీకీకరణ పనులను చేపట్టి 7 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్నారు. తూర్పు అదిలాబాద్ లోని మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంప‌ల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు నిర్మాణం చేయబోతున్న లిఫ్టుల కోసం ఆయకట్టు సర్వేను చేపట్టడానికి వాప్కోస్ సంస్థతో సంప్రదింపులు జరుపాలని సీఎం ఆదేశించారు. మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా సంగమేశ్వర లిఫ్టు, బసవేశ్వర లిఫ్టు పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సత్వరం డీపీఆర్ లు తయారు చేయించాలని ఆదేశించారు.