etala rajender

 

నేను గళమెత్తాకే ఆయనకు మంత్రి పదవి..

 

🔹ఈటల నోట మళ్లీ హరీశ్ రావు ప్రస్తావన…

 

హుజురాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ ఉపఎన్నికలో తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కుట్ర జరిగిందన్నారు. టీఆర్ఎస్ నేతలే ప్రత్యర్థికి డబ్బులు పంపించి తనను ఓడించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో చేసినట్లు తాను కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు చేశానని చెప్పారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఈటల ఆరోపించారు. ‘ఈటలకు ఓట్లు వేయొద్దని టీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి… కానీ మీ మనస్సాక్షి ప్రకారమే ఓటు వేసి ధర్మాన్ని గెలిపించండి.’ అని ఈటల పేర్కొన్నారు. మంత్రి హరీశ్ రావు,తానూ ఉద్యమంలో కలిసి పనిచేశామని ఈటల గుర్తుచేశారు. ఒకానొక సమయంలో హరీశ్ రావు కోరలు పీకేందుకు కూడా కేసీఆర్ యత్నించారని… హరీశ్‌కు,తనకు మంత్రి పదవి ఇవ్వొద్దని భావించారని ఆరోపించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక… మూడు నెలల పాటు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదని ఈటల గుర్తుచేశారు. మూడు నెలల తర్వాత హరీశ్‌ను కాదని తనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో… ఈ గులాబీ జెండా ఒక్కరిది కాదు… ఈ పార్టీ ఒక్కరిది కాదని తాను గళమెత్తానని… ఆ తర్వాతే హరీశ్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈటల తన ప్రసంగాల్లో పదేపదే తన పేరును ప్రస్తావించడంపై ఇదివరకే హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘త‌న గొడ‌వ‌కు నైతిక బ‌లం కోసం ప‌దేప‌దే నా పేరును ప్రస్తావించ‌డం ఈట‌ల రాజేంద‌ర్ భావ‌దారిద్య్రానికి, విజ్ఙత‌, విచ‌క్షణ‌లేమికి నిద‌ర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాల‌నుకోవ‌డం విఫ‌ల ప్రయ‌త్నం మాత్రమే కాదు.. వికార‌మైన ప్రయ‌త్నం కూడా. ఆయ‌న మాట‌ల్లో మ‌నో వికార‌మే త‌ప్ప స‌త్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌ను తీవ్రంగా ఖండిస్తున్నా..’ అంటూ గతంలోనే హరీశ్ ఘాటుగా స్పందించారు. రెండు రోజుల క్రితం కూడా హరీశ్ ఈటలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈటలకు అన్నం పెట్టింది… రాజకీయాల్లో అ,ఆలు నేర్పింది కేసీఆర్ అని… ఆయన బతికుండగానే ముఖ్యమంత్రి కావాలని ఈటల ప్రయత్నించారని ఆరోపించారు. ఈటలకు టీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఓవైపు హరీశ్ రావు ఇలా ఈటలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… ఈటల మాత్రం పదేపదే తన గొడవలోకి హరీశ్ రావును లాగుతూనే ఉన్నారు. తనతో పాటు హరీశ్ రావుకు పార్టీలో అవమానం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉంటే,హుజురాబాద్‌లో పోటీకి సంబంధించి ఈటల రాజేందర్ సతీమణి జమునా రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తమ ఇద్దరిలో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో హుజురాబాద్ బరిలో ఈటలకు బదులు జమునా రెడ్డి పోటీ చేయబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది.