పరిహారంతో పరిహాసమా.. ప్రాణం పోతుంటే పట్టదా
🔹కేసీఆర్‌పై షర్మిల విసుర్లు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. పరిహారం అందక బాధితులు ప్రాణాలు తీసుకుంటుంటే దొరకు చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. సొంత ఇలాకాలో దారుణాలు జరుగుతుంటే మామా, అలుళ్లకు ఏమీ అనిపించడం లేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల వయసులో మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడంటే.. ఆయన ఎంత మానసిక క్షోభను అనుభవించి, అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడో ఆలోచించాలన్నారు. మీ కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఆ బాధేంటో అర్థమవుతుందన్నారు. మల్లారెడ్డి ప్రాణం తీసిన పాపం కేసీఆర్, హరీశ్ రావులదేనని చెప్పారు. ప్రాజెక్టుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న ముంపు గ్రామాల ప్రజలకు జీవించే హక్కు కూడా లేదా అని ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న మల్లన్నసాగర్ ముంపు బాధితుల మనోభావాలను అర్థం చేసుకోకుండా.. ఐదేళ్లుగా అధికారులు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి కావస్తున్నా పరిహారం చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఇల్లు, వాకిలీ, భూమిని స్వాధీనం చేసుకొని, నిలువ నీడలేకుండా చేసి వేధించడం సరికాదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే రైతు మల్లారెడ్డిని బలి తీసుకుందని ఆరోపించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం 2016 నుంచి భూసేకరణ చేశారు. 2017 నుంచి పనులు ప్రారంభించినా.. పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం బాధితులను ఇబ్బందులకు గురిచేశారు. న్యాయం చేయాలని వేములఘాట్‌లో 963 రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిన మాట నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. 2019 నుంచి ఇళ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు, అర్హులుగా గుర్తించిన 6,800 మంది బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలన్నారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద పాత ఇంటిని వాల్యూయేషన్ చేసి, ఇళ్ల కేటాయింపు చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ వద్ద ముత్రాస్ పల్లిలో 2,234 ఇళ్లు నిర్మించి కొందరికీ కేటాయించినా..ఇంకా 4,566 మంది బాధితుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల విషయంలో ఏ ఒక్కరికీ రిజిస్ట్రేషన్ చేయలేదని, అసలు ఏ ఇల్లు ఎవరికి కేటాయించారో అధికారిక ధ్రువీకరణ లేదని షర్మిల ఆరోపించారు. 2020 ఏప్రిల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో కట్టించిన వెయ్యి ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉందని, మొన్న వచ్చిన చిన్నపాటి వర్షానికే ప్రహరీ గోడలు కూలిపోవడం, ఇంటి ముందు భూమి కుంగిపోవడం జరిగిందంటే.. ఇళ్ల నిర్మాణం ఎలా జరిగిందో అర్థమవుతుందన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి ఏడాది కాకుండానే మరమ్మతులు చేయడం విస్మయానికి గురిచేస్తుందన్నారు.
2019లోనే ముంపు బాధితుల కోసం 450 ఎకరాల్లో అతి పెద్ద కాలనీ నిర్మిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి కావస్తున్నాఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. ముంపు బాధితుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు కట్టించే వరకు భూములను స్వాధీనం చేసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి, కోర్టు ధిక్కారం కేసులు ఎదుర్కొంటున్న కలెక్టర్ వెంకటరామిరెడ్డిని, ముగ్గురు ఆర్డీవోలు, ఎమ్మార్వోలను ఒకే దగ్గర ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను ఒకే దగ్గర ఏడేళ్లు కొనసాగించిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 2019లో అర్హులకు స్వయంగా కలెక్టర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం దారుణమన్నారు. బౌన్స్ అయిన చెక్కులు వారి దగ్గరే ఉన్నాయని, కొందరికి ఇప్పటికీ పరిహారం అందలేదని దీనికి సీఎం కేసీఆరే సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నా..పరిహారం, ఇళ్లు, ప్లాట్లు ఇవ్వకుండా ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటి గట్టుకిష్టాపూర్ గ్రామాలకు నీళ్లు, కరెంట్ నిలిపివేయడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. ఒంటరి మహిళలు, పురుషులకు ఇల్లు, పరిహారం ఇవ్వకూడదని ఏ చట్టం చెబుతుందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితులకు సరైన పరిహారం, భరోసా ఇవ్వకుండా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని ప్రాజెక్టుల కింద ముంపు బాధితుల పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. ప్రజలను, వారి హక్కులను గౌరవించలేని కేసీఆర్‌కు సీఎం పదవీలో కొనసాగే హక్కులేదని అన్నారు. మల్లన్న సాగర్ కింద సర్వస్వం కోల్పోయిన బాధితులు తెలంగాణ ప్రజలు కాదా అని ప్రశ్నించారు. తక్షణమే మల్లారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.