jagan

 

పార్లమెంటులో వైసీపీ వ్యూహం ఇదే

 

🔹ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం..

 

అమరావతి (ప్రశ్న న్యూస్) త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నందున పార్టీ అనుససించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశంలపై వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల సాధనే ప్రధాన ఏజెండాగా సభలో వ్యవహరించాలని సీఎం జగన్ ఎంపీలకు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు, తెలంగాణతో నీటి వివాదం, రాయలసీమ ఎత్తిపోతల, విభజన హామీలు, పన్నుల్లో రాష్ట్రం వాటా పెంపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పేదలకు ఇళ్ల నిర్మాణం, ప్రత్యేక హోదా అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని సీఎం జగన్.. ఎంపీలకు సూచించారు. ఈ మేరకు సమావేశ వివరాలను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 55,656 కోట్ల అంచనా వ్యయం ఆమోదంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. జాతీయ ప్రాజెక్టుల వ్యవయాన్ని కేంద్రమే భరించాల్సి ఉన్నా.. పోలవరంకు మాత్రం రాష్ట్రమే వ్యయాన్ని భరిస్తోందన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజికి సంబంధించి 33వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా పైసా విడుదల కాలేదన్నారాయన. తెలంగాణతో జల వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అనుమతించాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. తెలంగాణలో 800 అడుగుల లోపు 50 టీఎంసీల సామర్థ్యంతో 5 ప్రాజెక్టులు నిర్మించినందున ఏపీలోనూ 800 అడుగులకే ఎత్తిపోతుల నిమించేలా అనుమతివ్వాలని కోరనున్నట్లు వెల్లడించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోనికి, కేంద్ర బలగాల పర్యవేక్షణలోకి తీసుకురావలనే డిమాండ్ ను ప్రస్తావిస్తామన్నారు.

ఏపీలో ఆందోళనలకు కారణమవుతున్న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని నిలుపద చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,112 కోట్లు విద్యుత్ పాత బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. రేషన్ కార్డుల సబ్సిడీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా లేవనెత్తుతామన్నారు. ఈ అంశంలో కేంద్రం నుంచి రూ.5,056 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.పేదలకు ఇళ్ల పథకంలో భాగంగా 17వేల లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టిందని.. ఆ కాలనీల్లో మౌలిక వసతులకు అదనంగా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.6,750 కోట్ల బకాయిలు వచ్చేలా పోరాడతామన్నారు. సాలూరులో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీకి ఆమోదం తెలపాలని కోరతామన్నారు.
ఇక విభజన చట్టంలో అమలు కాని హామీలను వెంటనే అమలు చేసాలా కేంద్రాన్ని కోరతామని విజయసాయి రెడ్డి తెలిపారు. కోవిడ్ వల్ల రాష్ట్రం రూ.20 వేల కోట్లు నష్టపోయిందని..న్యాయం చేయాలని కోరాతమ్ననారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రం వాటా 42శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ వస్తోందని దీనిపైనా కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఇప్పటికి 12సార్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీఎం జగన్ కేంద్ర పెద్దలను కోరారని.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఇక నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై సీఎంతో జరిగిన సమావేశంలో చర్చించలేదని విజయసాయి స్పష్టం చేశారు. రఘురామ కృష్ణంరాజు క్యారెక్టర్ లేని వ్యక్తని.. ఆయనపై సీఎంస్థాయిలో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.