Modi

 

పొంచివున్న థర్డ్‌వేవ్ ముప్పు

 

🔹6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే సద్దు మణుగుతోంది. రోజువారీ కేసులు అదుపులోనే ఉంటూ వస్తోన్నాయి. కరోనా వల్ల సంభవించిన మరణాలు కూడా ఇదివరకట్లా ఆందోళన కలిగించే విధంగా నమోదు కావట్లేదు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 38,949 కరోనా కేసులు నమోదయ్యాయి. 542 మంది మరణించారు. 40,026 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు కుదుటపడ్డాయనుకుంటోన్న ఈ దశలో థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలు ఆందోళనను కలిగిస్తోన్నాయి. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతోండటం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీ సహా ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో సంప్రదింపులు నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్-ఏపీ, ఎంకే స్టాలిన్-తమిళనాడు, పినరయి విజయన్-కేరళ, బీఎస్ యడియూరప్ప-కర్ణాటక, నవీన్ పట్నాయక్-ఒడిశా, ఉద్ధవ్ థాకరే-మహారాష్ట్ర ఇందులో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనికి హాజరయ్యారు.థర్డ్‌వేవ్ ముప్పును ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ప్రధాని వారికి సూచించారు. మొత్తం కేసుల్లో 80 శాతం వాటా ఆయా రాష్ట్రాల నుంచే వెలుగులోకి వచ్చినందున ఈ సారి ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్.. ఈ నాలుగు అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. అత్యధిక పాజిటివిటీగా ఉన్న ఈ రాష్ట్రాల్లో టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్‌ను ముమ్మరం చేయడం ద్వారా రోజువారీ కేసులను నియంత్రించాలని చెప్పారు. ప్రత్యేకించి- మహారాష్ట్ర, కేరళల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతోన్నాయని, తక్షణమే వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా కేసుల పెరుగుదలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా వైరస్ తీవ్రత ఇదివరకు ఎక్కడ ఆరంభమైందో.. మళ్లీ అక్కడికే వచ్చి చేరే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.