Jg

 

ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నాం – సీఎం జగన్

 

అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన జగన్.. తరువాత మళ్లీ ఎప్పుడు అంశం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి జగన్ అడిగారని వైసీపీ నేతలు చెప్పడం తప్పా.. ఆయన దీనిపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ తాజాగా ప్రత్యేక హోదాపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని..మనం కేంద్రాన్ని అడగడం తప్పా.. ఇంక చేయగలిగినది ఏం లేదని జగన్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపామని.. ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గాని ఇంకా ఏమన్నా చేయాలంటే చేయవచ్చు.. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది..సంకీర్ణ ప్రభుత్వం అయి ఉంటే ఆలోచించవచ్చు కానీ పూర్తి మెజారిటీ ఉన్నాగానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మిన్నకుండిపోతోందని అన్నారు.తాను కేంద్రాన్ని అడుగుతున్నా అని సీఎం జగన్ చెప్పారు కాని.. కేంద్ర ఏం చెపుతోంది అన్నదారిపై సీఎం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవ్వడం కుదరదనో.. లేక ఇప్పటిలో ఇచ్చే పరిస్థితి లేదని.. కాదు అంటే ప్రత్యామ్నాయం గురించో ఎదో ఒకటి సమాధానం చెప్పే ఉంటారు. కానీ సీఎం జగన్ మాత్రం కేంద్రం ఏం చెబుతోంది అన్న విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు మౌనంగా ఏం మాట్లాడని ఢిల్లీ పెద్దలకు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి చెబితే ఏం లాభం. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని విపక్షాలు మండిపడుతున్నాయి.

సీఎం జగన్ కు నిజంగా ప్రత్యేక హోదా తెప్పించాలని కోరిక ఉంటే.. పోరాటం చేయాలని.. పోరాడితే ప్రత్యేక హోదా ఎందుకు రాదని విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్షాలు విమర్శలు ఎలా ఉన్నా.. ఢిల్ల వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని మాత్రం ప్రత్యేక హోదా కోసం అడుగుతానని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీకి ప్రత్యేక హోదా గురించి పదే పదే అడగటం తప్ప చేసేది ఇంక ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్ధితులు మారతాయనే నమ్మకముందని.. నమ్మకంతోనే ముందుకు సాగాలని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తు వస్తున్నామని ఈ కరోనా సమయంలో కూడా ఎటువంటి పథకాలు ఆపకుండా కొనసాగిస్తున్నామని ఏపీకి ఇటువంటి పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ ప్రకటించామన్నారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని..ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు కానీ ఏపీలో మా ప్రభుత్వంలో అదిసాధ్యమైందని అన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశామని.. ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.