revanth

 

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ రైతు వ్యతిరేకులే

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. కిసాన్ సంసద్ పేరుతో రైతుల పార్లమెంటును నిర్వహిస్తూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిరసన తెలియజేస్తున్న రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీరి పోరాటానికి మద్దతుగా ఈరోజు జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రాన్ని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి అని నిప్పులు చెరిగారు. సేవ్ ఫార్మర్స్ సేవ్ ఇండియా అంటూ నినాదాలు చేస్తూ రైతులకు మద్దతు తెలిపిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ రైతు వ్యతిరేకులేనని ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న రైతులపై ప్రధాని నరేంద్ర మోడీ దేశద్రోహ, రాజద్రోహం చట్టాలను పెట్టి ఆందోళన అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ఎనిమిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా, అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

రైతులు రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలుపుతున్నా, ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నా కేంద్రానికి ఇవేవీ పట్టడం లేదని విమర్శించారు. రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి చనిపోయిన రైతులకు పార్లమెంట్లో సంతాపం తెలియజేయడానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అనుమతించలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీలానే సీఎం కేసీఆర్ కూడా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబట్టారు. రీజన్ ఇదే సూటు బూటు వేసుకున్న వాళ్ళ కోసమే కేంద్ర సర్కార్ పనిచేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను చేసినప్పుడు,ఈ వ్యవసాయ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారని, పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని చెప్పి, ఢిల్లీ వచ్చి మోడీని , అమిత్ షా ను కలిసిన తర్వాత ప్రధానికి కెసిఆర్ లొంగిపోయారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీల పోరాటం ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలను మానుకొని, రైతులకు నష్టం చేసే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యల పరిష్కారం కోసం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతు సంక్షేమం కోసం పని చేయాలని హితవు పలికారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల పై నిరసన తెలియజేస్తూ పార్లమెంటులోనూ పోరాటానికి దిగాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్రాక్టర్లతో ర్యాలీ చేసి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో దిక్కులు పిక్కటిల్లేలా వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్నా వినిపించుకోని కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని తేల్చిచెప్పారు.