Modi

 

ప్రధాని మోదీ మన్ కీ బాత్

 

🔹రేడియో జాకీ గంగ, సంస్కృతంలో ఎఫ్ఎం
🔹వాటర్ ప్లస్ సిటీగా ఇండోర్  
🔹స్పోర్ట్స్‌పై ఫోకస్

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావించడంతో ఆయన ప్రసంగం ఆరంభమైంది. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను స్మరించుకున్నారు. ఆయన అందించిన స్ఫూర్తితోనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ స్ఫూర్తిదాయక విజయాలను సాధించిందని అన్నారు. క్రీడారంగం సత్తా చాటడానికి ధ్యాన్‌చంద్ చెక్కు చెదరని పునాదులు వేశారని చెప్పారు. ఒలింపిక్స్‌లో సాధించిన విజయాలు ఇక్కడితో ఆగకూడదని ప్రధాని అన్నారు. ఈ వేగాన్ని కొనసాగించాలని తాను అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి నగరాల వరకూ ప్రతి ఒక్కరూ క్రీడల గురించి ఆలోచించేలా దేశ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో విజయాలను సాధించారని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి క్రీడా మైదానం కూడా ఆటగాళ్లతో కళకళలాడాల్సిన దశకు భారత్ చేరుకుందని అన్నారు. ఒక్క క్రీడకే పరిమితం కాకుండా.. అన్నిరకాల స్పోర్ట్ యాక్టివిటీస్ స్వేచ్ఛగా కొనసాగాల్సి ఉందని చెప్పారు. పోటీ తత్వంతోనే ప్రతి ఒక్కరు సమున్న విజయాలను అందుకోగలుగుతారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. క్రీడలతో పాటు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. అరుదైన సెక్టార్లలో యువత వినూత్న రీతిలో విజయాలను అదుకోవడానికి తపన పడుతోందని, ఇది దేశ పురోగతికి, ఆత్మ నిర్భర్ భారత్‌కు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ కితాబిచ్చారు. కృష్ణాష్ఠమి పర్వదినాన్ని పురస్కరించుకుని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మందిరం అభిివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ వాటర్ ప్లస్ సిటీగా ఆవిర్భవించిందని ప్రధాని చెప్పారు. అత్యాధునిక పద్ధతులను ఇండోర్ వాసులు అనుసరిస్తోన్నారని, పర్యావరణాన్ని సంరక్షించుకుంటోన్నారని ప్రశంసించారు. సంప్రదాయేతర ఇంధన వనరులతో అక్కడి ప్రజలు అద్భుతాలను సృష్టిస్తోన్నారని చెప్పారు. ప్రత్యేకించి- నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా ఇండోర్.. వాటర్ ప్లస్ సిటీగా ఆవిర్భవించిందని మోడీ అన్నారు. సుదీర్ఘకాలం నుంచి ఇండోర్ నగర్ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలుస్తోందని గుర్తు చేశారు. గుజరాత్‌లోని కెవాడియాలో కొందరు యువతీ యువకులు కలిసి కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియోను నడిపిస్తోన్న విషయాన్ని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రేడియో జాకీ గంగా సహా పలువురు యువకులు సంస్కృతంలో తమ కార్యక్రమాలను వినిపిస్తోన్నారని మోడీ చెప్పారు. సోమ్‌నాథ్‌లో శ్రీకృష్ణ భగవానుడి సేవలో ఉంటోన్న అమెరికన్ మహిళతో మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవిగా అభివర్ణించారు. తాను కొన్నేళ్ల నుంచీ ఇక్కడి సంప్రదాయాలను పాటిస్తున్నానని చెప్పారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ దగ్గరి నుంచి శాటిలైట్ల వరకు ప్రతి ఒక్కరూ తమతమ రంగాల్లో విశ్వకర్మలేనని మోదీ పేర్కొన్నారు. చేతివృత్తులపై ఆధారపడిన ప్రతి ఒక్కరి ద్వారానే సమాజం అభివృద్ది చెందుతుందని చెప్పారు. మన చుట్టూ చాలామంది చేతివృత్తిదారులు కనిపిస్తుంటారని, వారందరూ దేశ ప్రగతి కోసం శ్రమించే వారేనని అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం అనేక చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం స్కిల్ డెవలప్‌మెంట్ మీదే ఆదారపడి ఉందని మోడీ పేర్కొన్నారు. దేశంలో నైపుణ్యానికి కొరత లేదని, దాన్ని మరింత సాన పెట్టాల్సి ఉందని అన్నారు.