ప్రభుత్వ పఠశాలల్లో తెలుగు తప్పని సరి..
ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే
అమరావతి (ప్రశ్న న్యూస్) ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో.. ఏ క్లాస్ లో అయినా సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా బోధన చేసే ప్రతి తరగతిలో తెలుగు కంపల్సరీగా ఉంటుందని, విద్యావ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. విద్యారంగంలో సమూల మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే నాడు – నేడు కింద 34 వేల పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2019 – 2021 దాక 6 లక్షల 22 వేల 856 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి నమోదు చేసుకున్నారని వివరించారు. ఏ స్కూల్ మూయకూడదు, ఏ టీచర్ తీయవద్దనే భావనతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకరావాలని, ఏ ఒక్క పేదింట్లో పిల్లవాడు చదువు మానకూడదనే ఉద్దేశ్యంతో పలు పథకాలు తీసుకరావడం జరిగిందన్నారు. ఎన్ని సమస్యలున్నా.. అధిగమిస్తూ.. ముందుకెళుతున్నామన్నారు. అలాగే ఈ నెలలో అమలు చేయనున్న నవరత్నాలతో పాటు.. పలు పథకాలపై ఏపీ మంత్రివర్గం చర్చించింది. హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని.. కర్నూలులో ఏర్పాటు చేయడంతో పాటు, లోకాయుక్తను కూడా అక్కడికే తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్ అంచనాలకు ఆమోదముద్ర వేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులకు కూడా ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపునకు కేబినెట్..20 వేల రూపాయల డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం 4 లక్షల మందికి సుమారు 500 కోట్లు ఇవ్వనుంది. 10 వేలలోపు 3.4 లక్షలమంది డిపాజిట్‌దారులకు ఇప్పటికే పంపిణీ చేసింది.
కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే..
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద.. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు. ఇంటింటికీ చెత్త సేకరణ విధానం, పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ. రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.
అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణ. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణకు ఆమోదం. 1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం. మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం రివైజ్డ్ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్ట్ రివైజ్డ్ డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం. ఏపీఐఐసీ, ఏపీఎంబీల వాటాలు 50 నుంచి 74 శాతం పెంపునకు ఆమోదం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం.
నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి… టెక్నో ఎకనామిక్ ఫీజుబిలిటీ స్టడీ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం.
ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం. ఇందుకోసం సుమారు రూ. 550 కోట్లు కేటాయించింది. ఈనెల 13న వైఎస్‌ఆర్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులకు కేబినెట్ ఆమోదం. హైకోర్టు ఆదేశానుసారం ఏపీలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కార్యాలయాలు, హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు తరలించాలని నిర్ణయం. రాష్ట్ర మానవహక్కుల సంఘం కార్యాలయాన్నీ కర్నూలుకు తరలించాలని నిర్ణయం.
గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్- 2021కి కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం.ఉద్యాన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్ ఆమోదం.