ఫలిస్తున్న రేవంత్ వ్యూహం..
🔹కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత
🔹ఆయన కుమారులు కూడా ఆహ్వానం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అందర్నీ కలుపుకుపోతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ కాంగ్రెస్ నేతల్ని కలిసి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. వారు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌తో ఆదివారం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోకి దేవేందర్ గౌడ్‌ను ఆయన ఇద్దరు కుమారులను కూడా ఆహ్వానించారు. వీరి వెంట పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా ఉన్నారు. దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్‌లతో భేటీ అయి రేవంత్ రెడ్డి ముగ్గురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీనిపై వారు సుముఖత వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే రేవంత్ రెడ్డి మాజీ కాంగ్రెస్ నేతలైన, డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల్ని కలిసిన సంగతి తెలిసిందే. వారు త్వరలోనే మళ్లీ కాంగ్రెస్‌లోకి రానున్నారు. టీడీపీలో ఉన్న దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 2008లో నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన మళ్లీ టీడీపీలో చేరిపోయారు.