బండి సంజయ్ కొత్త డిమాండ్
దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు పథకాలు కూడా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ (ప్రశ్న న్యూస్) దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు పథకాలు కూడా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చారని బండి సంజయ్ దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు అవని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి పథకం అటకెక్కిందని, రైతు ఋణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులిచ్చినా కూడా తెలంగాణలో ఎక్కడా కనిపించటం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం బీజేపీ చేపట్టబోయే దరఖాస్తు ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీర్ ప్రజల్లోకి వస్తాడని, రాష్ట్రంలో దళిత బంధు అందరికీ రావాలని ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్న దళిత బంధు తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇవ్వాలని, బీసీ బంధు ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. దరఖాస్తు ఉద్యమంలో ప్రజలతో దరఖాస్తు తీసుకుని కలెక్టర్‌లకు ఇస్తామని వివరించారు. బీసీ బంధు, గిరిజన బంధు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామని.. నిరుద్యోగ భృతి ఇవ్వాలని దరఖాస్తులు తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రెస్‌మీట్‌లో బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..
టిఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక, రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని దరఖాస్తుల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం.
గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ఈ దరఖాస్తు ఉద్యమం.
మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేదే ఉద్యమం ఉద్దేశం. దళిత బంధు పథకం లాగే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దరఖాస్తు రూపంలో స్వీకరించి మా పార్టీ తరపున ప్రభుత్వానికి ఇస్తాం. మేము ఇచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తారా లేదా అన్నది మీ ఇష్టం. ఉప ఎన్నిక ఉండడం వల్లే దళిత బంధు ప్రారంభించారు. దళిత బంధు ఎస్సీ రిజర్వుడ్ నియోజక వర్గాల్లో ప్రారంభిస్తే బాగుండేది. హుజురాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో 10 లక్షలు ఇవ్వాల్సిందే. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో మాట తప్పావు. ఉన్న ఉప ముఖ్యమంత్రి తొలగించావు. మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే ఒక దళిత కుటుంబానికి కనీసం 30 లక్షల లబ్ది జరిగేది. ఆవాస్ యోజన కింద కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి డబుల్ బెడ్ రూమ్ అన్నారు. అది కూడా ఇవ్వలేదు. ఓట్ల కోసమే దళిత బంధు పేరిట కొత్త డ్రామా. దళితులను అభివృద్ధి చేయాల్సిందే. మరి బీసీలో ఉన్న పేదలు నీకు ఎందుకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బిసి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాలి. నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు గిరిజన బంధు అమలు చేయాలి. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని మర్చిపోయారు. నాగార్జునసాగర్, దుబ్బాక, ఎన్నికలప్పుడు పోడు భూముల గురించి మాట్లాడి ఎందుకు పరిష్కరించలేదు.? గిరిజన మహిళలపై లాటి చార్జ్ చేసి నాన్బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారు. పసి పిల్లల తల్లులు బాలింతలు అని చూడకుండా జైలుకు పంపారు. 2018 ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వడ్డీలు పెరిగి పోయి రైతుల పంట డబ్బు బ్యాంకు అధికారులు ఆపుతున్నారు. ఇప్పటికీ పూర్తి రుణమాఫీ లేకుండా కేవలం 50 వేల లోపు నాని మాఫీ చేస్తానని చెబుతున్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయాల్సిందే. రాష్ట్రంలోని అన్నివర్గాల పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి. దరఖాస్తు ఉద్యమం గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తాం.