మకరం (Capricorn) 2022-2023
శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు
Capricorn/Makara/మకరరాశి
(ఉత్తరాషాఢ: 2,3,4 పాదములు, శ్రవణం: 1,2,3,4 పాదములు, ధనిష్ట: 1,2 పాదములు)
(ఆదాయం – 05 వ్యయం – 02 రాజపూజ్యం – 02 అవమానం – 04)
ఈ రాశివారికి గురుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి తృతీయ స్థానమందు రజితమూర్తి సౌభాగ్యకరముగను సంచరించును. వృత్తి ఉద్యోగ విషయములలో అలజడులున్ననూ ధైర్యముతో అంకిత భావముతో పనిచేసి అందరి మన్ననలను, ప్రశంసలను పొందెదరు. సరైన వ్యక్తులతో స్నేహం వలన ఈ రాశివారు సామాజికంగా ఎదుగుదల స్నేహ విస్తరణ జరుగుతుంది. తగిన ఆనందాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. గతం కంటే వ్యాపార వృద్ధి విస్తరణ జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలసివస్తాయి. సంప్రదాయ వ్యాపారాల కంటే ఆన్‌లైన్ అమ్మకాలు మీకు పురోగతిని కలిగిస్తాయి. గతంలో నిలచి ఉన్న బాకీలు వసూలు అవుతాయి. పూర్వీకుల నుండి సంక్రమించిన స్థిరాస్తులను మార్చుచేయడం ద్వారా లాభపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారస్తులు ముందంజ వేస్తారు.
ఈ రాశివారికి శని జన్మరాశి సంచారము ప్రతికూల పరిస్థితులు, మానసిక ఆందోళనలు, స్థానచలనము, బంధుమిత్ర ద్వేషములు, ధన విషయమై ఇబ్బందులు కుటుంబ స్ధితి అస్తవ్యస్తముగా యుండుట, కళత్రపీడ మొదలగు ఏల్నాటి శని సంబంధ ప్రభావములు వీరికి యుండును. హనుమాన్ చాలీసా పారాయణలు చేయుటచే కొంత ఉపశమనము కల్గును. శనైశ్చరుడు ఏప్రిల్ 29 నుండి ద్వితీయ స్థానమందు కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచరించును.
Know More Capricorn/Makara/మకరరాశి
జూలై 12 తేదీ నుండి అక్టోబర్ 23 తేదీల మధ్య ధనిష్ట 1, 2 పాదములలో వక్రించి జన్మరాశిలో సంచరించును. ఈ రాశివారికి ఏల్నాటి శని తాలూకు ప్రతిబంధకములు ఇంకా పోలేదు. ఆరోగ్య విషయం, ఆర్ధిక శారీరక, మానసిక విషయాల్లో పురోగతి పెద్దగా ఉండకపోయినా గతం కంటే మెరుగైన జీవన విధానం కల్గుతుంది. సమస్యలకు పరిష్కారం ఒక్కొక్కటి లభిస్తుంది.
రాహుకేతువులు ఏప్రిల్ 12వ తేదీ నుండి వరుసగా చతుర్ధ, రాజ్యస్థానమునందు లోహమూర్తులుగా సంచరింతురు. ఆశయాలను సాధించుకొనుటకు క్రమశిక్షణా రాహిత్యమైన మార్దాలను ఎంచుకోవడం, తాత్కాలిక ఆనందం పొందటం జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి, కోరికలను అదుపులో ఉంచగల్లితే ఈ రాహుకేతువుల దుష్ప్రభావం నుండి బయటపడగల్గుతారు. రాహుకేతువుల సంచారం అనుకూలం కాదు. మాతృవర్గం వారి అనారోగ్యం సైతం మిమ్ములను బాధిస్తుంది. వాహనముల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణములను వాయిదా వేయుట మంచిది. మానసికంగా ఆందోళన చెందకుండా, దోష నివారణార్ధం దుర్గా, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయుట మంచిది.
ఉత్తరాషాఢ నక్షత్రంవారు మానసిక ఆందోళనల నుంచి బయటపడతారు, శ్రవణం వారికి అస్థిమితం తగ్గి మానసిక ప్రశాంతత కల్లి పురోగమిస్తారు. ధనిష్ట నక్షత్రంవారు జన్మరాశిలో శని సంచారకాలంలో రుద్రాభిషేకము చేసిన అవాంతరముల నుండి బయట పడతారు.
ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘8’. 3,5 6, 7, 8 తేదీల సంఖ్యలు సోమ, మంగళ, శుక్ర వారములు కలసిన మరింత యోగప్రదమగును.
నెలవారీ ఫలితములు
ఏప్రిల్: గ్రహస్థితి అనుకూలము, కుటుంబ సభ్యుల ఉన్నతి, సభా సంఘాలలో దర్జాగా వ్యవహరించుట, కీర్తి వృద్ధియగుట, ధనధాన్య వస్త్ర లాభములు, మంచి ఆరోగ్యము క్రమశిక్షణ, కీర్తివృద్ధి విద్యా విషయాల్లో ముందంజ.
మే: గృహ వాతావరణము అనుకూలము, గృహమున శుభయోగములు, లోభత్వం చేత ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయములు సామాన్యము, మిశ్రమ ఫలితములు గ్రహస్థితి సామాన్యము, కార్యనాశనము, అసంతృప్తి, ధనము నిల్వ.
జూన్: గృహమున మంగళ తోరణములు, మృష్టాన్న భోజనం, సకల సౌకర్యాలు ఏర్పరుస్తారు. ఆరోగ్య విషయమై ఏమరపాటు తగదు. వృత్తి వ్యాపారులకు సామాన్య లాభాలకు లోటుండదు. ఆదాయ మార్గాలు గురించి అన్వేషిస్తారు.
జూలై: గృహమున అలంకరణ వస్తువులు ఖరీదుచేయుట, నూతన వస్త్ర లాభములు అలంకార ప్రియత్వము, మతపరమైన కార్యకలాపాలలో పాలుపంచుకుంటారు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయమార్గాలు మెరుగవుతాయి.
ఆగష్టు: గ్రహస్థితి మిశ్రమము, వృత్తి వ్యాపారములు సామాన్యము, అసత్యం, ప్రలోభాలకు లొంగుట, శరీర ఆరోగ్యం సామాన్యము. నడుము, మోకాళ్ళ నొప్పులతో సమస్యలు వైద్యసహాయం పొందుతారు. ధనవ్యయం, అస్తిమితం.
సెప్టెంబర్: తను చేసిన కృత్యముల వలన ఇతరులకు బాధ కల్గించుట, శరీరమందు సోమరితనము ధనాదాయమార్గాలు లేకపోవుట, కుటుంబ గౌరవము లోపించుట, నిషిద్ధ పదార్ధములను భక్షించుట సత్సంప్రదాయము వీడుట జరుగును.
అక్టోబర్: అతిశ్రమ, ఉద్యోగ విషయములు అనుకూలము గాకపోవుట, చింత, మొదలుగా గల గ్రహప్రభావములు అనుకూలముగాదు. దుర్గామాత నాశ్రయించి శరణువేడి, కష్టముల నుండి గట్టెక్కెదురు. సంతానము సన్మార్గములో నడిపించుట ముఖ్యము.
నవంబర్: ఈ మాసములో గ్రహస్థితి కొంతమెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యముల యందు ఆసక్తి ధర్మబుద్ధి మనస్తాపములు తొలగుట, వృత్తి వ్యాపారములలో ముందంజ, ఉద్యోగలబ్ధి, స్థానచలన సూచన, ధనాదాయ మార్గములు మెరుగవును.
డిసెంబర్: సర్వత్రా విజయం, పెట్టుబడులు అధిక లాభాలనిస్తాయి, ధనాదాయం పెరుగుతుంది, మీ వృత్తులలో నిబద్ధత చూపిస్తారు. ఆత్మసంతుష్టి పెరుగుతుంది. సమస్త దోషములు తొలగి ఐశ్వర్యం మిమ్ములను వరిస్తుంది.
జనవరి 2023: ఇల్సు, బంధు మిత్రులతోనూ శ్రేయోభిలాషులతోనూ కళకళ లాడుతుంది. మిమ్ములను అందరూ మెచ్చుకుంటారు. ధనవ్యయమైతే పెరుగుతుంది. ధైర్యంతో ప్రణాళిక, అవగాహనతో నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.
ఫిబ్రవరి: తార్కికమైన తెలివితేటలు కొత్తగ అదాయ మార్గాలను ఎంచుకుంటారు. మీ సంస్థలను సమర్ధవంతంగా నడిపి అందరి మన్ననలను పొందుతారు. గ్రహస్థితి మిశ్రమము. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. లాభాలబాట పడతారు.
మార్చి: గ్రహస్థితి సామాన్యము, విద్యార్ధులకు సామాన్యము. ఆదాయంతో బాటు ఖర్చూ పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలకు బేరీజు వేసుకునే సమయం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
** ** **