KCR

 

మారిన కేసీఆర్ వ్యూహం..

 

🔹ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు..
🔹ఛాన్స్ ఎవరికో..?

 

రాబోయే రోజుల్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. కొందరిని తప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలా కొందరిని తప్పించి వారి స్థానంలో దళిత వర్గానికి చెందిన నేతలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని సమాచారం.

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం మారింది. దళితబంధు పథకం ప్రవేశపెట్టడంతో పాటు దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. దళితులకు మరింత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని.. అన్ని అంశాల్లోనూ వారికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సభలో ప్రకటించారు. దీన్ని బట్టి రాబోయే ఎన్నికల్లో దళితుల ఓట్లను సాధ్యమైనంత ఎక్కువగా టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఇదిలా ఉంటే రాజకీయంగా ఆ వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. త్వరలోనే మంత్రివర్గంలోనూ దళితులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. వారికి మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక ఖాళీ ఏర్పడింది. రాబోయే రోజుల్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. కొందరిని తప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలా కొందరిని తప్పించి వారి స్థానంలో దళిత వర్గానికి చెందిన నేతలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ లేరు. మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఈ వర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఈ దిశగానే ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. కేబినెట్‌తో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్ కేబినెట్‌లో దళిత నేతలకు ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు రావడంతో… ఆ ఛాన్స్ తమకు దక్కుతుందనే ఆశతో పాటు కొందరు నేతల్లో టెన్షన్ కూడా మొదలైందనే టాక్ వినిపిస్తోంది.