monkey Mask

కరోనా పట్ల నిర్లక్ష్యమే జనం కొంప ముంచుతుందా.?

 

🔹కోతులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి,
🔹మనుషులు  జాగ్రత్తలు మరిచారు
🔹కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ముందు జాగ్రత్తగా మాస్క్ ధరిస్తున్న కోతులు
🔹మాస్క్ ధరించిన కోతి అరుదైన దృశ్యం ప్రజా ప్రశ్న న్యూస్ కెమెరాకు చిక్కింది

 

(సిరిసిల్ల ప్రశ్న న్యూస్ బ్యూరో దుర్గం విజయ్ బాబు) ఎల్లారెడ్డి పేట్ మండలం వెంకటాపూర్ గ్రామంలోకి ఓ కోతుల గుంపు వచ్చింది. అందులో ఒక కోతి మాస్క్ పెట్టుకొని అటు ఇటు దూకడం అరుదైన దృశ్యం ప్రజా ప్రశ్న న్యూస్ కెమెరాకు చిక్కింది. మనుషులు కనీస జాగ్రత్త చర్యలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ కోతిని చూసిన చాలా మంది, వీలు ఎలాగూ మాస్కు పెట్టుకోక కరోనా తగిలించుకుంటారు. వీళ్ళతో  జాగ్రత్తగా ఉండాలని ఆ కోతి మాస్కు పెట్టుకుందని  అక్కడున్న స్థానికులు చర్చించుకున్నారు.   కొవిడ్ నిబంధనల అమలులో నిర్లక్ష్యమే జనం కొంప ముంచుతోంది. జనసమ్మర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ముఖ్యంగా రైతుబజార్లు, వ్యాపార సముదాయాల వద్ద దుకాణ దారులు, వినియోగ దారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మాస్కులు ఎందుకు ధరించడం లేదని ప్రశ్నిస్తే జనమిచ్చే వింత సమాధానాలు కరోనా పట్ల నిర్లక్ష ధోరణికి అద్దం పడుతోంది.

రైతు బజార్లు, మాంసం, చేపల మార్కెట్లు, పండ్ల, కిరాణా దుకాణాలు నిత్యం వందలాది మందితో కిక్కిరిసిపోయే కూడళ్లివి. పల్లెల నుంచి రైతుబజార్లకొచ్చి కూరగాయలు అమ్ముతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు, జనం దుకాణాలకు పోటెత్తుతారు. కరోనా కోరలు చాస్తున్న వేళ జనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలివి. కానీ ఇక్కడ కొవిడ్ నిబంధనలు అసలు అమలు కావడం లేదు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు వ్యవహరిస్తున్నారు.కరోనా బారిన పడతామన్న భయం ప్రజల్లో ఎక్కడ కనిపించడం లేదు. మాస్కు ఎందుకు ధరించ లేదంటే వారు చెప్పే సమాధానాలు అంతుబట్టడం లేదు. చాలా దుకాణాల్లో కనీసం శానిటైజర్ కూడా అందుబాటులో పెట్టడం లేదు. స్థలాభావంతో భౌతికదూరం సైతం పాటించడం లేదు. దుకాణాలే పక్కపక్కన ఉండటంతో వినియోగదారులు కూడా భౌతిక దూరాన్ని పాటించలేని దుస్థితి.

కరోనా మహమ్మారి రాష్ట్రంలో పంజా విరుసుతున్నా ప్రజలు అలసత్వాన్ని మాత్రం వీడటంలేదు. కొన్ని ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇంకా కరోనా ఉందా.! మాస్క్ వేసుకోవాలా.? అనుకునే వారు కొందరైతే మాస్క్ ముఖానికి తగిలిస్తే సరిపోతుంది ముక్కుకు వేసుకోవాలా ఏంటి అనేవారు ఇంకొందరు. నిర్లక్ష్యం నిప్పై దహిస్తోంది. ఈ మాట కాస్త కష్టంగా ఉన్నా ప్రస్తుతం కరోనా పరిస్థితులకు సరిగ్గా సరిపోతోంది. ప్రజల్లో కరోనా నిబంధనల పట్ల అలసత్వం వైరస్ వ్యాప్తికి కారణం అవుతోంది. ప్రభుత్వాలు, వైద్యులు మాస్కుల వినియోగాన్ని ఎంతగా వివరిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఫైన్లు విధిస్తున్నా నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు లేని వినియోగదారులకు సేవల్ని అందించకుండా ఉండాల్సింది పోయే దుకాణ యజమానులే మాస్కులు ధరించడం లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం శానిటైజర్ కూడా ఏ ఒక్క దుకాణంలో పెట్టడం లేదు. దీనిపై అధికారులు, పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొందరి అలసత్వం కారణంగా అందరికీ కరోనా ప్రమాదం మళ్లీ ముంచుకొస్తోంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ కొరతతో బాధితులు అల్లాడుతున్నా ప్రజల్లో కనీస మార్పు రావడంలేదు. కొవిడ్‌ ఆట కట్టించేందుకు టీకా రక్షణ  ఇస్తున్నా స్వీయ జాగ్రత్తలు మాత్రమే ప్రజలను కాపాడే బ్రహ్మాస్త్రాలు. 130 కోట్లకు పైగా జనాభా ఉండే భారతదేశంలో కరోనా కేసులు భరోగా నమోదయ్యాయి. రోజుకు 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు పరుస్తూ వచ్చాయి. అలాగే అందరూ తప్పకుండ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి అని చెబుతున్నాయి. కానీ మన దేశంలో సంగంమంది మాస్కులు ధరించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్వే నిర్వహించి విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ సమాచారం ప్రకారం దేశంలో 50 శాతం మంది మాస్కులు ధరించడం లేదు. ఇక ధరిస్తున్న 50 శాతం మందిలో 64 శాతం మంది మాస్కుతో నోటిని మాత్రమే కవర్ చేస్తున్నారు కానీ ముక్కును అసలు కవర్ చేయడం లేదు. 20 శాతం మంది గడ్డం పై, 2 శాతం మంది మెడపై మాస్కును ఉంచుకున్నారు. ఇక మిగిలిన 14 శాతం మంది మాత్రమే మాస్కును సరిగ్గా ధరిస్తున్నారని తెలిపింది. కనీసం కోతులను చూసైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి  కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి రక్షణ కల్పించుకొని దేశాన్ని  రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.