revanth

 

ముదిరిన మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి వివాదం

 

🔹టీఆర్ఎస్ నుంచి రాహుల్ గాంధీకి ఫిర్యాదు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) భూకబ్జా ఆరోపణలకు సంబంధించి టీఆర్ఎస్ మంత్రి చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య చెలరేగిన మాటల యుద్ధం పెనుదుమారానికి దారితీసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పరస్పరం మాటల దాడులు చేసుకోవడంతోపాటు మంత్రి దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలూ జరిగాయి. మల్లారెడ్డికి దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సవాలు విసరగా, రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలంటూ కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అసాధారణ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 లోని జీవీకే ఎదురుగా మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ధనరాజ్ రాథోడ్, దినేష్, బళ్ళు నాయక్ తదితరుల ఆధ్వర్యంలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ ఓ రౌడీ, గుండాలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఇదే అంశంపై మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర సంస్కృతిని టీఆర్ఎస్ నేతలు మార్చేస్తున్నారని అన్నారు. ”మల్లారెడ్డి.. దమ్ముంటే రాజీనామా చేయ్..లేకుంటే కేసీఆర్‌తో చేయించు… గజ్వేల్‌లో రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారని.. ఎవరు గెలుస్తారో చూద్దామని” అంటూ సవాల్ విసిరారు. మంచిగా చెప్తే ఈ దద్ధమ్మలకు అర్థం కావడం లేదని అందుకే తాము కూడా కేసీఆర్ భాషనే వాడుతున్నామని అద్దంకి దయాకర్ అన్నారు.

కాగా, మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వంపైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు అర్థంలేనివరి ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలంటూ ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేఖ రాశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలనీ లేకుంటే మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ రాణే గతే పడుతుందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. రానున్న రోజుల్లో తాము కూడా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానని ఆ లేఖలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, భూకబ్జాల విషయంలో రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ఇవాళ(గురువారం) సాయంత్రం వరకు రేవంత్‌రెడ్డికి గడువు ఇస్తున్నానని, తన సవాల్‌ని స్వీకరించాలని అన్నారు. తన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టంచేశారు. తాను సంపాదించిన ప్రతిరూపాయి తన కష్టార్జితమేనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి.. కేటీఆర్, కేసీఆర్‌పైన వాడిన భాష చూసే తీవ్రస్థాయిలో స్పందించానని తెలిపారు. ఇటీవల జరిగిన దళిత గిరిజన దండోరా సభలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాలను ప్రస్తావించారు. దీనిపై రియాక్ట్ అయిన మంత్రి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ”రేవంత్ రెడ్డి.. నువ్వు అబద్ధాలు, బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాల్లో నంబర్‌ వన్‌ కదా. గురువారం నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్‌ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్‌ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలే’అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.