ముదురుతోన్న నీళ్ల పంచాయితీ
🔹కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
🔹ఏపీ ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలని లేఖ
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ ముదురుతోంది. కృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్దమని… ఈ ప్రాజెక్టుతో పాలమూరు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ వాపోతోంది.మరోవైపు కేటాయింపులకు లోబడే తాము ప్రాజెక్టులు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రాజెక్టులను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణా బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు లేఖ రాశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. డీపీఆర్ పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రాథమిక పనులు మొదలుపెట్టి… ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని చెప్పారు.
ఎన్జీటీ ఆదేశాలు అమలయ్యేలా కృష్ణా బోర్డు వ్యవహరించలేదన్నారు. కనీసం నిజ నిర్దారణ కమిటీని కూడా అక్కడికి పంపించలేదని చెప్పారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు బోర్డు అనుమతి తప్పనిసరి అని గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వ చర్యలు తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ముఖ్యంగా కరువు,ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నీటి అవసరాలపై కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్పారు. కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం,పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను పరిరక్షించాలని కోరారు. ఇదే అంశంపై రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ సీఎం రాజశేఖర్ రెడ్డి కంటే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని.. అక్రమ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఏపీ ప్రభుత్వ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని… తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడివరకైనా వెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు.