Main4

మొబైల్ ఐసీయూ బస్సులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 

🔹దేశంలోనే తొలిసారిగా ఇలాంటి సేవలు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మొబైల్ ఐసీయూ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర,ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై వీటిని ప్రారంభించారు. అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు. లార్డ్స్ చర్చితో పాటు వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సంయుక్త సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. తొలి విడుతగా రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించామన్నారు. త్వరలోనే జిల్లాకు రెండు చొప్పున బస్సులను కేటాయిస్తామన్నారు. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. కోవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.

మొబైల్ ఐసీయూ బస్సులో పేషెంట్ల కోసం 10 పడకలు,వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులు,టెక్నీషియన్స్,సీసీటీవీ,లైవ్ ఇంటరాక్షన్ వీడియో, ఇతరత్రా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు.కరోనా వేళ ఈ మొబైల్ ఐసీయూ బస్సులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. చాలామంది పేషెంట్లు జిల్లా కేంద్రాలు లేదా నగరాల్లోని ఆస్పత్రులకు చేరుకునే లోపే ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఐసీయూల ద్వారా అలాంటి పేషెంట్లకు బస్సులో చికిత్స అందిస్తూనే ఆస్పత్రులకు చేర్చవచ్చు. ఏ మారుమూల ప్రాంతానికైనా ఈ బస్సుల్లో వెళ్లి చికిత్స అందించడం సులువు అవుతుంది.