Bajrang Punia

 

మోకాలి నొప్పితోనే.. కాంస్యం గెలిచిన కుస్తీవీరుడు

 

టోక్యో/న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్ వచ్చింది. పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్‌రంగ్ పునియా కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతకం కోసం జరిగిన కుస్తీ పోటీలో..కజక్‌స్థాన్ రెజ్లర్ దౌలత్ నియత్‌బెకోవ్‌ను 0-8 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఈ బౌట్‌లో బజ్‌రంగ్ పునియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఏ మాత్రమూ అవకాశం ఇవ్వలేదు. మొదటి పీరియడ్‌లో 2 పాయింట్లు, రెండో పీరియడ్‌లో 6 పాయింట్లు సాధించాడు. కజక్‌స్థాన్ రెజ్లర్‌కు ఒక్క పాయింట్ కూడా రాకపోవడంతో వార్ వన్ సైడ్‌ అయింది. బజ్‌రంగ్ పునియా ఉడుం పట్టుతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి మన దేశానికి మరో పతకాన్ని అందించాడు. బజ్‌రంగ్‌కు కాంస్య పతకం రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతంగా పోరాడావంటూ ప్రశంసలు కురిపించారు.వాస్తవానికి 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్‌రంగ్ స్వర్ణ పతకం గెలుస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో అతడే నెంబర్ వన్. కానీ శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బజ్‌రంగ్ పునియా ఓడిపోయాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న అజర్‌బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్ చేతిలో 5-12 తేడాతో ఓటమి పాలయ్యారు. ఐనప్పటికీ ప్లే ఆఫ్ బౌట్‌లో అద్భుతంగా రాణించి కాంస్య పతకాన్ని గెలిచాడు బజ్‌రంగ్ పునియా.