మోదీ కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేవు – రాహుల్
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో నెలకొల్పిన విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వ నిర్వహణా లోపం, వైఫల్యమే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా వైరస్ ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల సమయంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా, ముందుచూపుతో వ్యవహరించలేకపోయిందని అన్నారు. దేశంలో నెలకొన్న సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ థర్డ్‌వేవ్ సంభవిస్తుందనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసని, ఆ తరువాత కూడా మరిన్ని వేవ్స్ సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన అన్నారు. కరోనా వైరస్ స్థితిగతులపై రూపొందించిన శ్వేతపత్రాన్ని రాహుల్ గాంధీ విడుదల చేశారు. దీనికోసం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు కీలక అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తాను విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపదలచుకోలేదని, థర్డ్‌వేవ్‌పై దేశం మొత్తాన్నీ అప్రమత్తం చేయడానికి, దాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధం కావడానికి ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల సమయంలో నిర్వహణాలోపం చోటు చేసుకుందనే విషయం స్పష్టమౌతోందని రాహుల్ గాంధీ అన్నారు. దీని వెనుక గల కారణాలను వెలికి తీయడానికి తాము ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే వైట్ పేపర్‌ను విడుదల చేశామని చెప్పారు. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఉండటం, మ్యూటెంట్లు పుట్టుకుని వస్తోండటం వల్ల థర్డ్‌వేవ్ తరువాత కూడా మరిన్ని వేవ్స్ సంభవించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. యోగా దినోత్సవం సందర్భంగా అత్యధికులకు వ్యాక్సిన్ వేయడాన్ని రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలను కేంద్రం కొనసాగించట్లేదని అన్నారు. ఇలాంటివి ఒక్కరోజుకు మాత్రమే పరిమితం చేయాల్సినవి కావని సూచించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తోన్న సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోడీ కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేదని, ఆక్సిజన్ ఒక్కటే ఆ పని చేయగలుగుతుందని అన్నారు. సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థ ఉండి ఉంటే దేశంలో కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాల్లో 90 శాతాన్ని నిలువరించగలిగే వాళ్లమని చెప్పారు. ఆక్సిజన్ కొరత వల్ల అత్యధిక మరణాలు నమోదయ్యాయని తెలిపారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని మోడీ సరైన సమయంలో స్పందించలేకపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన దృష్టి అంతా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపైనే నిలిచిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై చూపించిన శ్రద్ధ.. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌పై పెట్టి ఉంటే.. మరణాలను అరికట్టడానికి అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరతను అంచనా వేయలేకపోయారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.