mod

మోదీ నాయకత్వానికి తగ్గిన జనామోదం

 

🔹రెండేళ్లలో 20 పాయింట్లు డౌన్
🔹అమెరికన్ కంపెనీ సర్వే

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ క్రమంగా తగ్గుతోందా… అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ అవుననే అంటోంది. 2019 నాటితో పోలిస్తే మోదీకి ఉన్న జనామోదం 20 పాయింట్ల మేర తగ్గినట్లు మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. అగస్టు,2019లో మోదీకి 82 శాతం జనామోదం ఉండగా… ఇప్పుడది 66 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.జమ్మూకశ్మీర్ విభజన,ఆర్టికల్ 370 రద్దు సమయంలో మోదీ నాయకత్వానికి ఎక్కువ జనామోదం లభించగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడం గమనార్హం. భారత్‌లో మోదీ నాయకత్వానికి జనామోదం తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలకు ఉన్న ఆదరణతో పోలిస్తే మోదీనే ముందు వరుసలో ఉండటం విశేషం. 66 శాతం జనామోదంతో మోదీ టాప్‌లో ఉండగా… ఏంజెలా మెర్కెల్(జర్మనీ-53 శాతం),జస్టిన్ ట్రుడో(కెనడా-48శాతం),బోరిస్ జాన్సన్(యూకె-44శాతం),మూన్ జే ఇన్(సౌత్ కొరియా37శాతం), పెర్డో సాంచెజ్(స్పెయిన్-36శాతం),ఇమాన్యుయెల్ మాక్రోన్(ఫ్రాన్స్-35శాతం),యోషిడే సుగా(జపాన్-29శాతం),మార్లో ద్రగి(ఇటలీ-65శాతం),లోపెజ్ ఒబ్రేడార్(మెక్సికో-63శాతం),స్కాట్ మారిసన్(ఆస్ట్రేలియా-54శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

భారత్‌లో దాదాపు 2216 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించినట్లు మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ప్రస్తుతం మోదీకి 66 శాతం జనామోదం ఉండగా 28 శాతం మంది ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని వెల్లడించింది. గురువారం(జూన్ 26) నాడు ఈ ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తుంటుంది.దీని అనుబంధ సంస్థ పొలిటికల్ ఇంటలిజెన్స్ యూనిట్ నుంచి రియల్ టైమ్ పోలింగ్ డేటాను సేకరించి విశ్లేషిస్తుంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ నాయకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మోదీ ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే సెకండ్ వేవ్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి పాఠాలు నేర్వకపోవడం… సెకండ్ వేవ్ నాటికి కూడా దేశ జనాభాకు సరిపడా వ్యాక్సిన్ల కొనుగోలు చేపట్టకపోవడం పట్ల మోదీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బహుశా ఈ కారణాలతోనే మోదీ ఇమేజ్ గతంలో కంటే తగ్గి ఉండొచ్చు. వచ్చే ఏడాది 7 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభ తగ్గుతుందన్న సంకేతాలు వెలువడం బీజేపీలో కాస్త అలజడి రేపే అంశమే.