మోదీ ‘ మన్ కీ బాత్
🔹వందేళ్లకోసారి వచ్చే సంక్షోభం, ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు
🔹వైరస్‌పై మరో గెలుపు ఖాయం అన్న ప్రధాని
🔹ల్యాబ్ టెక్నీషియన్ల పాత్రను విస్మరించలేం
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా దేశ ప్రజలు ఎదుర్కొంటోన్నారని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను నిలపడానికి అవసరమైన ఆక్సిజన్‌ను తరలించడంలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆక్సిజన్‌ను తీసుకొస్తోన్నారని ప్రశంసించారు.ఆక్సిజన్ తరలింపులో వారి సేవలు అసాధారణమైనవని ప్రధాని చెప్పారు. విదేశాలు అందించిన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర ఐసీయూ పరికరాలను స్వదేశానికి తీసుకుని రావడంలో వైమానిక దళాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయని చెప్పారు. విదేశాల నుంచి ఆక్సిజన్ కంటైనర్లను తరలించడంలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అనంతరం వాటిని దేశవ్యాప్తంగా అవసరమైన నగరాలకు తీసుకెళ్లడంలో రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళా లోకో పైలెట్ శిరీషతో మాట్లాడారు. ఆమె అనుభవాలను తెలుసుకున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభ పరిస్థితులు వందేళ్లకోసారి ఏర్పడుతుంటాయని, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఎవరికీ తెలియదని అన్నారు. ఈ విషయంలో అనుభవం లేదని చెప్పారు. అయినప్పటికీ- దేశ ప్రజలు కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటోన్నారని చెప్పారు. ఇదివరకు తాము ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితుల్లోనూ వెన్ను చూపట్లేదని అన్నారు. తొలి విడతలో కరోనా వైరస్‌పై ఘన విజయాన్ని సాధించామని, అలాంటి గెలుపును మళ్లీ త్వరలోనే అందుకోబోతోన్నామని మోదీ చెప్పారు.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాల్గొంటోన్న ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ప్రధాని ప్రశంసించారు. రోజూ 20 లక్షలకు పైగా దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగులు సాగుతున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో అవి నమోదు కావడంలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. లక్షలాది ల్యాబ్ టెక్నీషియన్లు నిరంతరాయంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్ల తరహాలోనే వారి సేవలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ ప్రకాష్ అనే ఓ ల్యాబ్ టెక్నీషియన్‌తో మాట్లాడారు. ఆయన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కోసారి తాము రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయాల్సి వస్తోందని చెప్పారాయన.
తన మన్ కీ బాత్ ప్రసంగంలో విజయనగరం మామిడిపండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ. కిసాన్ రైళ్ల వల్ల వేర్వేరు ప్రాంతాలకు చెందిన పంట దిగుబడులు దేశవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లోనూ రైతులు అద్భుతాలను సృష్టిస్తోన్నారని, రికార్డుస్థాయిలో పంట దిగుబడులను సాధిస్తోన్నారని చెప్పారు.