CJI Ramana

 

మోదీ సర్కారుకు సీజేఐ రమణ మరో షాక్

 

🔹పెగాసస్ నిఘా కుట్రపై నోటీసులు
🔹సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో.. ప్రస్తుత మోదీ సర్కారు పార్లమెంటును నడుపుతోన్న తీరు, అసలేముందో తెలియకుండానే కీలక బిల్లుల్ని ఆమోదించుకుంటోన్న వైనంపై ఆగ్రహావేదనలు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. పార్లమెంట్ స్తంభనకు కారనమైన ‘పెగాసస్ నిఘా ఉదంతం’లోనూ సంచలనానికి తెరలేపారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ నిఘా కుట్ర అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్ని విచారిస్తోన్న సీజేఐ బెంచ్ మంగళవారం నాడు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, కేంద్ర తరఫు లాయర్ వాదనను సమర్థిస్తూ దేశ భద్రతపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళ్తే రాజకీయ, మీడియా తదితర వర్గాలకు చెందిన దాదాపు 500 మంది ప్రముఖులపై కేంద్ర ప్రభుత్వం నిఘాకు పాల్పడిందని, అందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వినియోగించిందనే ఉదంతంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. పెగాసస్ అంశంపై దర్యాప్తు, ప్రభుత్వ వివరణను కోరుతూ విపక్షాలు రచ్చకు దిగడంతో ఇటీవలి పార్లమెంట్ సమావేశాలు రసాభసగా ముగియడం విదితమే. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, సామాజిక కార్యకర్తలపై కేంద్రం నిఘాకు పాల్పడిందనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ద్వారా గానీ, న్యాయ కమిటీ ద్వారా గానీ విచారణ జరపాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. సోమవారం నాటి వాదనల్లో కేంద్రం తీరుపై విస్మయం వ్యక్తం చేసిన సీజేఐ బెంచ్, మంగళవారం నాటి విచారణలో కేంద్రం వాదనల్లో కొన్ని అంశాలకు అంగీకరిస్తూనే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు రాజకీయ నేతలు, మీడియా, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్ ద్వారా నిఘా ఉంచారా? లేదా? అసలు కేంద్రం పెగాసస్‌ స్పైవేర్‌ను వాడిందా? లేదా? అన్న ప్రశ్నకు పదే పదే సమాధానం దాటవేసిన కేంద్రం.. సదరు అంశాలను ప్రజలందరికీ బహిర్గతం చేయలేమని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు, పెగాసస్ గానీ మరో స్పైవేర్ గానీ వాడటం అనేది జాతీయ భద్రతతో ముడిపడిన అంశం కాబట్టి, సంబంధిత వివరాలను నిపుణుల కమిటీకి మాత్రమే తెలియజేస్తామని, సదరు కమిటీనే సుప్రీంకోర్టుకు ఓ రిపోర్టు సమర్పిస్తుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ‘‘పెగాసస్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేసింది. నిజంగా దాన్ని వాడామని బహిరంగా ఒప్పుకుంటే అది దేశ భద్రతకు ఇబ్బందికర పరిణామం అవుతుంది. ఉగ్రవాదులు, వాళ్లు నడిపంచే స్లీపర్ సెల్స్ అప్రమత్తమై, కేంద్రం నిఘా నుంచి జారుకునే ప్రమాదం ఉంది. కాబట్టే మేం పెగాసస్ పై లోతైన వివరాలేవీ నేరుగా కోర్టుకు అందించలేం. అయితే సంబంధిత విషయాలన్నీ నిపుణుల కమిటీకి నివేదిస్తాం” అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీనికి పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందా లేదా అని స్పష్టంగా చెప్పకుండా, అది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని సొలిసిటర్ జనరల్ పదే పదే చెప్పడంపై సీజేఐ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ భద్రత విషయంలో కేంద్రంగానీ, సుప్రీంకోర్టుగానీ, పిటిషనర్లుగానీ రాజీపడాల్సిన అవసరం లేదు. అలా చేయాలని మేం కూడా చెప్పట్లేదు, పిటిషనర్లూ కోరట్లేదు. నిజంగా పెగాసస్ వ్యవహారం నేషనల్ సెక్యూరిటీ అంశంగా భావించినట్లయితే ఆ వివరాలను ప్రభుత్వం కోర్టుకు నేరుగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అలాగని పిటిషనర్ల హక్కులను కూడా మేం కాలరాయలేం.

కాబట్టి పెగాసస్ అంశంలో జాతీయ భద్రతా పర్యవసానాలు ఇమిడి ఉన్నాయని.. ఒక సున్నితమైన అంశాన్ని సంచలనం చేయాలని ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరఫు న్యాయవాది గట్టిగా వాదించడం, ఊహాగానాలతో.. నిర్ధారణ కాని నివేదికల ఆధారంగా పిటిషనర్లు కేసు వేశారని చెప్పిన నేపథ్యంలో అసలీ పిటిషన్లను ఎలా విచారించాలనేదానిపై సీజేఐ బెంచ్ సమాలోచనలు చేస్తున్నది. ‘‘ఈ కేసులోని సంక్లిష్టతల దృష్ట్యా తదుపరి దీన్ని ఎలా విచారిస్తే బాగుంటుందో మేం ఆలోచించుకోవాలి. అందుకే విచారణను 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. అయితే, ప్రాథమికంగా ఈ ఆరోపణలు అన్నిటికీ బదులు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కేంద్రానికి నోటీసులు ఇస్తున్నాం” అని సీజేఐ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ ల ధర్మాసం వ్యాఖ్యానించింది. మోదీ సర్కారు పెగాసస్ స్పైవేర్ వాడిందా? లేదా? అనే విషయాన్ని ఒక్క ముక్కలో స్పష్టం చేస్తే సరిపోతుందని, ఇదే అంశంపై అటు ఇజ్రాయెల్ లో ప్రభుత్వం సోదాలు నిర్వహించి విచారణ చేపట్టిన దరిమిలా ఎన్ఎస్ఓ సంస్థ సాధికారతపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని, అసలు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తెలిసే ఇది జరిగిందా? అనేది వెల్లడి కావాల్సి ఉందని పిటిషన్ల తరఫు లాయర్ కపిల్ సిబల్ అన్నారు. తాము క్లారిటీ మాత్రమే కోరుతున్నామని, దేశ భద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేనంత వరకే కేంద్రం నుంచి సమాధానాలు కోరుతున్నామని చెప్పారు. మొత్తంగా దేశ భద్రత అంశంలో రాజీ పడాల్సిన అవసరం లేదని విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు, పిటిషన్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే తదుపరి వాయిదాలో ఈ కేసును సీజేఐ బెంచ్ ఎలా విచారిస్తుందనేది ఉత్కంఠగా మారింది.